Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలాంటి కసీ అందరికీ వుండదు, సత్యమే.

ఉండినా, చివరిదాకా నిలవమా నిలవవు కొందరికి.

నిలిచాయా, కోటలో పాగా వేశాడన్నమాటే యివతలి మనిషి.

అయితే, బుద్ధి గ్రహణసమర్థమే గాని - ప్రతిభ కూడా నవనవోన్మిషితమే గాని ప్రవృత్తి జాడ్యజుష్టం అవుతూ వుంటుం దప్పు డప్పుడు.

కాగా, - గురువుకి పరమానుగ్రహం వుండడం చాలదు, తన దీక్షా యేమాత్రం అయినా సడలకుండా వుండదు, యేమిటేమిటో విప్రతిపత్తులూ యేర్పడకుండా వుండవు - అయినా, విద్యార్థి అయినవాడు, ఎక్కడో వొకక్కడ, ఎవరిచేతనో వొకరిచేత యిలాంటి దెబ్బతిన్నాడా - చాలు, పుంభావసరస్వతి అయిపోతాడు.

12

అనుకోకపోవాలి గాని, దీక్షా యేకాగ్రతా నిత్యప్రసన్నాలు మా నాయనగారికి.

దీనికి సాయం, అటు, నరసింహయాజులుగారికి మాట యిచ్చిన బాధ్యతా, యిటు, పాపయ్య సోమయాజులుగారిని 'నీ లెక్కేమిటి బావా?" అని డెకారించాలన్న కసీని.

నిద్రాహారాలు మరిచిపోయారు మా నాయనగారు.

కథాక్రమం యెలాగంటే?

సంసారం మీదపడిం దప్పటికి, కనక, యింటోనే వుండి సాధించుకోవా లది.

ఇంతే కాదు, మునికొడవలిలో అది చెప్పగల గురువు లేడు, సొంతంగానే సాధించుకోవాలి.

మా తాతగారు రాసిన తాటాకుగ్రంథాల్లో ఆ పుస్తకం దొరికింది; గాని రుక్కుల ఆద్యంతాలు మాత్రమే సమగ్రంగానూ సక్రమంగానూ వుండి, మధ్యభాగాలు క్లుప్తులు పెట్టి పూర్తిచేసిం దది.

సంతలూ వల్లెలూ పూర్తిచేసుకుని యేకరువు పెట్టుకునేవారికి మాత్రమే వుపయోగిస్తుం దది.

కాగా, వొకవిధంగా అది వుండినా లేనిదే అయింది.

మరొకవిధంగా అదయినా దొరికింది, అందుకే సంతోషించారు మా నాయనగారు.

ధర్మమే.

తపనా దీక్షా వున్నచోట సాధనం యేపాటిదయినా పని గడిచిపోతుంది.

నేను పోలవరంలో ప్లీడరుగుమాస్తాపని నేర్చుకునే రోజుల్లో, యూరపియను ఏజెన్సీ కలెక్టరు, వేటకు బయలుదేరి, మాటు చేరుకోకపూర్వమే పులి యెదురు కాగా, నౌకర్ని తన కడ్డంగా నుంచోబెట్టుకుని, వాడి బుజంమీదుగా తుపాకీ పెట్టి కాల్చి చంపాడు దాన్ని,

తుపాకీతో గాదు, విల్లమ్ములతో గాదు, బల్లెంతో గాదు, కత్తితో కాదు, కైజారుతో నయినా కానేకాదు - చేతిలో వున్న ములకాటికర్ర తిరగవేసి తల పగిలేటట్టొక్కటే దెబ్బ కొట్టి పెద్దపులిని చంపారు, మా పితామహుల పితామహులు

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2

240