నాటికి నేడు నవోదయ మాత్రమే పూనుకుం దిందుకు దృఢంగా.
ఇంగ్లీషులో యీరకం రచనలు చాలా వున్నాయిట, తెనుగులో మాత్రం అదే మొదటిది నేను చూసినంతవరకూ.
అమృతంకంటేనూ మిక్కిలి మధురమైన శివరామశాస్త్రిగారి వచనరచన కావడంవల్ల నన్నెంతో ఆకర్షించిం దది.
దీంతో, కొన్నాళ్లు నేను మిక్కిలీ బాధపడ్డాను, హఠాత్తుగా ఆ రచన ఆగిపోయినందుకు.
అప్పటిమాట యేమయినా, సాహిత్య తపస్సిద్ధులు శివరామశాస్త్రిగారి ఆరచన, మన తెలుగుజాతికి, ఇప్పుడూ యెప్పుడూ అగత్యమైనదే.
నిజానికి, మనవారికి “నా" అన్న అభిమానమే వుంటే నొక్క శివరామశాస్త్రిగారే కాదు - క్లిష్టసమస్యలు సాధించిన అనుభవాలతోనూ, అస్థిగతా లయిపోయిన వాటి జ్ఞాపకాలతోనూ పండబారిన దీర్ఘజీవితాలతో మహర్షు లయినవారింకా యెందరో వున్నారు, మన తెనుగు వారిలో.
అన్ని విద్యల్లోనూ వున్నారు.
రచనల్లో ఆరితేరినవారున్నూ వున్నా రెందరో.
తక్కిన మన పత్రికల సంపాదకులు మాత్రం వారిలో వొక్కరినీ కూడా కదిపిన పాపానపోవడం లే దిప్పటికీ.
కారణం లేశమూ గుర్తించలేకుండా వున్నా న్నేను; కాని ఉత్సాహమూ, సాహసమూ, స్తోమతూ మాత్రమే వుండడం కాదు, పత్రికలు నడపడానికి క్కావలసిన యోగ్యత.
తెలుసుకోగలిగితే, వేత్తలే రచించిన స్వీయ జీవితరహస్యాలు ఎంతెంతలేసి పత్రికలకున్నూ అంతస్థుకి అంతస్థూ పెంచుతాయి, విలవకీ విలవా కలిగిస్తాయి.
కాక:- దీక్షాకంకణధారులైన కళాతపస్సుల సాధకావస్థలూ, ఉత్తీర్ణులైన కళావేత్తల ప్రతిభాప్రాగల్భ్యాలూ, వర్ధమానచంద్రులైన తమ జాతియువకులకు పరిచయం చెయ్యవలసిన బాధ్యత తప్పించుకోడం, పత్రికల సంపాదకులకు, శిక్షార్హమైన నేరం.
కించ:- తెనుగు జాతి కొత్తకొత్త వీధుల్లో ముందంజ వెయ్యవలసిన యుగసంధి యిది.
పత్రికా సంపాదకులు మాత్రమే యిందుకు సరి అయిన మార్గం నిర్దేశించగలరు.
ఈ విశేషం గుర్తించలేనివారు, సాహసించి యీపదవి కెగబాకడం జాతికి శ్రేయస్కరం కాదు.
ఏతావతా:- నాజీవితరహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల, తమ నవోదయ అంతస్థు ఏమాత్రం పెరుగుతుందో, తమ పూని క్కూడా యేమాత్రం సఫలం అవుతుందో అది మిత్రులు వేంకటశేషయ్యగారే చూసుకుంటారు.
ఇక వున్నదల్లా యేమి టంటే?
ఈ సంకల్పమూ, యీ పూనికా జర్నలిజంలో వారికుండుకున్న పరిజ్ఞానానికి పతాకలు.
జాతి అభ్యున్నతి విషయమై వారికిగల ఆవేదనకు సాక్షీభూతాలున్నూ.
2
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1