Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈసూ, చూపోపమీ, ఓర్చలేకపోవడమూ, ఉడుకు మోత్తనమూ, కడుపుమంటా, అక్కస్సూ - ఇలాంటి మనోవికారాలు పెంచుకుని సమర్థులనూ పూజ్యులనూ చులకనచేసి మాట్టాడతారు చాలామంది, చాటునా మాటునా.

తమ ప్రతిపక్షుల యెడల యిలా ప్రవర్తించేవారిని చేరదీస్తే యెవరికీ తప్పనిదే యీ పతనం.

అయితే, స్వాములవా రిదేమీ గుర్తించుకోలేదు.

పైపెచ్చు, తమ ముద్రాధికారం చెలాయించడానికి పూనుకున్నారు వారు.

“యాజులికి వెలి” అంటూ శ్రీముఖాలున్నూ పంపేశారు. అవసరం అయినవారి కందరికీ.

“ఇప్పుడేం చేస్తాడు యాజులు?" అంటూ వెన్ను విరుచుకున్నారు కూడా వారు.

నిజమే.

బ్రాహ్మడయినవాడి కింతకంటే కఠినశిక్ష మరి లే దా రోజుల్లో.

ఎవరూ గుమ్మం యొక్కరు, ఎవరూ చూరుకింది కయినా రానివ్వరు, నిప్పూ నీరూ కూడా పుట్టవు, వెలి అయినవాడికి.

మంగళ్ళు క్షౌరం చెయ్యరు, చాకళ్ళు బట్ట లుతకరు.

చండాలురకున్నూ లేని నికృష్టస్థితి యిది.

మరొకరయితే నిలువునా నీరయిపోయివుందు రప్పుడు.

కాని అందుకు మారుగా యాజులుగారున్న వుద్రిక్తులయిపోయారు.

వీరభద్రావతారమే తాల్చేశారు చివరికి.

అప్పుడు, వారు, స్వాములవారికి చేసిన మొదటి ప్రతిక్రియ, వారు పంపిన ఆంక్షపత్రిక చింపి పోగులు పెట్టడం.

రెండో ప్రతిక్రియ, వెంటనే చయనానికి సంకల్పం చెయ్యడం.

వేలమీద అన్నదానం జరగాలి దానికి.

అదిన్నీ బ్రాహ్మలకు జరగాలి, ముఖ్యంగా.

ఎందరో ఋత్విక్కులు కావాలి.

వేదశ్రౌతాలతో ముఖరితం కావాలి యాగశాల.

ఎవణ్ణి తమ గుమ్మం యెక్కనివ్వరో వాడి యింట నోరు విప్పుతారా పండితులు?

విస్తరిన్నీ వేస్తారా బ్రాహ్మలు?

చెయ్యకపోతే యాజులుగారికి మరి పుట్టగతులుండవు.

బతకడానికే అవకాశం వుండదు.

గత్వాగత్వా యాజులుగారే జయిస్తే?

ఈ దెబ్బే ఆచార్యపీఠానికి తగులుతుంది.

అది చులకన అయిపోతుంది దేశంలో.

పాదపూజలు వెనకబడతాయి.

ఆజ్ఞలు హాస్యాస్పదా లయిపోతాయి.

జాతికిది శ్రేయస్కరమా?

235

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి