Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంచేతనే, గాయకు లదే పాడేవారు, జంత్రనిపుణు లదే వాయించేవారు మొదట.

ఇప్పుడది బాగా పాతబడిపోయింది.

కర్ణాటకానికి విలాసవిహారభూమి అయిన ఆ దక్షిణాదిని కూడా త్యాగరాజు పాడిన రాగాలూ, రచించిన కీర్తనలూ అనేకా లెరగ రిప్పటికీ మహామహాగాయకులున్నూ.

చెప్పవచ్చిం దేమి టంటే?

ఏది యేమయినా, అప్పటికీ యిప్పటికీ గూడా అరవలదే వరవడి, ప్రామాణికత్వమూను, మనవాళ్లే రూపురేఖలు దిద్దిన కర్ణాటకంలో.

స్వత్వం కూడా వారి భుక్తంలోనే వుంది చెన్నపట్నం విషయంలో లాగే.

ఇలాగ సర్వవిషయాల్లోనూ మనవాళ్ళు తీసికట్టే, తమలో తాము గోతులు తవ్వుకోడంలో తప్పించి.

కాగా, గాయకులే తక్కువ, సంగీతవిద్యాగురువు లసలే తక్కువ, అప్పట్లో మన దేశంలో.

ఉన్నవారిలో నయినా మనసు విప్పిచెప్పేవారూ తక్కువే.

అంతటి మహావైణికులు సంగమేశ్వర శాస్త్రిగారికే తప్పింది కా దీ అపకీర్తి.

వేదవేదాంగాలూ తక్కిన కళలూ నేర్పే గురువులు కనబరిచే ఔదార్యం లేశమూ కనబడదు, మన సంగీత విద్యాగురువుల దగ్గిర.

అది, పాఠాలు చెప్పడంలో కూడా డబ్బు దొరికే విద్య కావడమే యిందుకో కారణం అయివుంటుంది.

కాక, - ఏ విద్యల్లో నయినా, గురువుల ఔదార్యం కంటే శిష్యుల యేకాగ్రతా పరిశ్రమా యెక్కువగా వుండాలి కా దనను; గాని గురువులు ప్రారంభావస్థలో ప్రాతిపదిక అయినా సరిగా చెప్పకపోతే యెలాగా?

పరకాయిస్తే, మన తెనుగుదేశంలో మనదే - కనీసం మనదిన్నీ - అయిన యీ విద్య వ్యాపించకపోడానికీ, దేశీయుల కీవిద్య అంటే అభిరుచి యేర్పడకపోడానికీ, గానసభలు బహుళంగా జరక్కపోడానికీ బాధ్యత అంతా మన సంగీత విద్వాంసులదే, ముమ్మాటికీ.

విద్య అన్నది యేదీ కూడా గహనంగా వుంటుంది; గాని విశదంగా వుండదు.

ప్రతీవిద్యకూ లక్ష్యలక్షణా లుంటాయి.

లక్షణం విద్వాంసులకూ, లక్ష్యం జనానీకానికీ వినియోగం.

శంకరాభరణంలో శుద్ధమధ్యమానికి బదులు ప్రతిమధ్యమం వేస్తే కల్యాణి అయిపోతుం దన్న సంగతి రసికులకు తెలియకపోవచ్చు, తెలియనూ అక్కర్లేదు కొంతమట్టుకి, అది యథాతథంగా వుంచీ మార్చీ పాడితే మాత్రం రెండు రాగాల మాధుర్యమూ చక్కగా అనుభవిస్తారు వారు.

కనక, దేశంలో యే విద్య వ్యాపించాలన్నా, ఆ విద్యకు సంబంధించిన కళాత్మకభాగం జనులకు పరిచితం అయివుండాలి.

అది జరగాలంటే, అందుకా విద్యలో ప్రవీణులయినవారు బాగా పూనుకోవాలి.

229

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి