శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
అనుభవాలూ - జ్ఞాపకాలూను
మొదటి సంపుటం
ఉపక్రమణిక
మిత్రులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు, తమ నవోదయ కోసం నా అనుభవాలూ - జ్ఞాపకాలూ రాసి పంపమని అడిగారు.
ఒకమాటు కనపడినప్పు డడిగారు, మరోమాటు కార్డు రాశారు, చివరి కింకోమాటు కలుసుకున్నప్పుడు తప్పదంటూ తొందరకూడా చేశారు.
దీనికి సాయం, అంతక్రితం, ఆనందవాణి పత్రికలో చిన్ననాటి నాదీపావళి ముచ్చట్లు చదివివుండిన మిత్రులు, అటు వేంకటశేషయ్యగారి సంకల్పం మిక్కిలి ప్రశంసించి, యిటు రచన సాగించమని ప్రోత్సాహపరిచారు నన్నెంతో.
"కాదు" అనలేకపోయా న్నేను.
నేనెప్పుడూ అనుకోని విషయం, ఇది.
నిజంగా, నాకిది మిక్కిలి కొత్త ప్రేరణ.
అయినా, వారందినాలు గడిచెటప్పటికే స్థాయిభావం యేర్పడిపోయింది నాకీ విషయమై.
ఇలాంటి రచనల విలవ గుర్తించిన తెలుగు పత్రికల్లో నాకు తెలిసినంతవరకూ నవోదయ రెండోది.
అంతకిముందు, కీ.శే. శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారి ప్రజామిత్ర పత్రిక బ్రహ్మశ్రీ వేలూరి శివరామశాస్త్రిగారి అనుభవాలూ - జ్ఞాపకాలూ (?) కొన్ని ప్రకటించివుంది.
అయితే, తెనుగు పత్రికల్లో మరి దేనికీన్నీ యీ విషయం ఆకర్షకం కాలేకపోయింది.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
1