సాధించి కమ్మగా ఫిడేలు వాయించాలి.
వాయించి, నాదానందం అనుభవించాలి.
నాకిది దీక్ష.
నాటకాల్లో శ్రుతి కలపడం చేతనయి వుండడంవల్లా, సర్వదేవుడుగారు వీణ పలికిస్తూ చెప్పడంవల్లా స్వరస్థానాలు మొదట్లోనే సులభంగా పట్టుకోగలిగా న్నేను.
చరచరా పదిరోజుల్లో పది సరళీస్వరా లయిపోయాయి.
తాళయుక్తంగా త్రికాలసాధన కూడా జరిగిపోయింది.
అప్పుడు ప్రారంభించాను ఫిడేలు.
కమాను లాగడం మొదటినాడే పట్టుబడింది.
షడ్జరిషభస్థానాల్లోనూ, గాంధారమధ్యమస్థానాల్లోనూ నాలుగు తీగలకూ వుపయోగించేటట్టు బోర్డుమీద కాగితం పీలిక లంటించారు సర్వదేవుడుగారు.
శ్రుతిన్నీ వారే సరిచేసి చేతికిచ్చేవారు.
కాని గాత్రాన పలికినంతవర కయినా జంత్రాన గమకం పలికేది గాదు.
పిళ్లారిగీతాలు వాయించేటప్పుడు కలిగింది నాకీ సందేహం "యేమిటిదీ?" అని.
ఘనరాగగీతాల్లో స్థిరపడిపోడంతోపాటు అనుమానమున్నూ కలిగింది.
సాహసించి వొకనా డడగ్గా "రాగభావం తెలిసేదాకా అది చెప్పడంవల్ల లాభం లేదు, గ్రంథం కావా"లన్నారు సర్వదేవుడుగారు.
నాకు తృప్తికాలేదు.
తామే పిలిచి నాకు విద్య చెప్పడానికి పూనుకున్నా రాయన, కుచ్చితం కనపరచవలసిన అగత్యం లేశమూ లేదు; గాని యిదేమిటి?
6
ఒక యువకుణ్ణి ఫిడేలువాద్యానికి పెట్టుకున్నాం మా నాటకాలకు మేము.
అప్పటి నాటక ప్రదర్శనాల్లో శ్రుతిమట్టుకే హార్మోనియం.
నటుడు పాడుతూ వుంటే, ఇప్పుడు హార్మోనియం అనుసరిస్తున్న ట్టప్పుడు ఫిడే లనుసరించేది.
తబలా నాకు పనికిరాదు.
కనక, హిందూస్థానీరాగాలతోపాటు నే నదీ నిషేధించాను.
పరిపూర్ణమూ జాతీయమూ అయిన మద్దెల వుండగా, అసమగ్రమూ విజాతీయమూ అయిన తబలా యెందుకు స్వీకరించాలీ మనం?
సంపూర్ణమూ, అచ్చంగా జాతీయమూ అయిన కర్ణాటక సంగీతం వుండగా, కొంత విజాతీయమూ కొంత సంకరమూ అయిన హిందూస్థానీ సంగీతమున్నూ మన మెందుకు స్వీకరించాలి?
మనవాళ్ళు బాగా విమర్శించుకోవలసిన విషయం యిది.
కనక, యీ చర్చ మరోమాటు.
225
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి