Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరవాత్తరవాత, నా "ప్రబుద్ధాంధ్ర” పత్రిక సంస్కృత విభాగంలోనూ కొన్ని వ్యాసాలు ప్రకటించా న్నేనా శీర్షికతో, అది మరోమాటు.

పోతే, మన జాతి బాగుపడాలంటే, ఆంధ్రచంద్రికలో, నేను నిర్దేశించిన మార్గాలొ, మన కర్ణాటకం బాగా పోషించుకోడం వొకటి.

దానికి ప్రతిబంధకం అవుతుంది కనక, తెనుగువాడైనవా డెవ్వడూ కూడా యే విధంగానూ హిందూస్థానీ సంగీతం చేరనివ్వగూడదని సకారణంగా స్పష్టపరిచా నందులో నేను.

అప్పటికే కా దిప్పటికీ మిక్కిలీ స్థిరనిశ్చయం నాకిది.

ఈ నిశ్చయంతోనే, మా నాటకసమాజంలో హిందూస్థానీ పాడగూడదని గట్టిగా కట్టడి చేసివున్నా న్నేను.

రంగస్థలాన నటులు కర్ణాటకమున్నూ పాడగూడ దనీ - అసలు నాటకాల్లో సంగీతమే వుండగూడదనీ - అంచేత, పాటలే కాదు నాటకాల్లో పద్యాలున్నూ వుండకూడదనీ యిటీవలి నా నిశ్చయం, దీనిసంగతిన్నీ పర్యాయత్వేనా చూసుకుందాం.

మా నటులు అసంతృప్తిగానే అయినా నా కట్టడి మన్నించసాగారు; గాని, ఉన్నట్టుండి, అభ్యాసవశాన, వారిపాటలో హిందూస్థానీకళ పడేది, మనస్సు చివుక్కుమనేసేది నాకు.

దీంతో, శుద్ధకర్ణాటకం విని ఆనందించాలంటే స్వయంగా నేర్చుకోడం వొక్కటే దారి అయింది నాకు.

నేర్చుకోవాలన్న సంకల్పమూ పుట్టింది, అవ్యవధానంగా.

అయితే, యెక్కడో సకృతుగా వుండే సహృదయుల దగ్గిర గురుకులవాసం అయినా చెయ్యాలి, డబ్బయినా యివ్వాలి గురువులకు, సంగీతం నేర్చుకోవాలంటే మరి మూడో మార్గం లేదు.

వాటిలో గురుకులవాసం నాకు చాలా యిష్టమే; గాని యిల్లు విడిచే అవకాశాలు తప్పిపోయాయి నా కప్పటికే.

డబ్బున్నూ లేకపోయింది.

“జీర్ణం జీర్ణం" అయిపోయింది నా సంగీతప్రీతి, చివరికీ.

అయితే, నాటకసమాజనిర్వహణతో నా అభిలాష మారాకుతొడిగినట్టే, కాలం గడవడంతో, అందుకొక అవకాశమున్నూ తటస్థపడింది, ఎన్నడూ అనుకోనిది నాకు.

3

వారణాసి వేంకటరామయ్యగారూ, సర్వదేవుడుగారూ అని మండపేటలో యిద్దరన్నదమ్ములు.

ఇద్దరూ వైణికులు.

వారిలో సర్వదేవుడుగారు, మావూరి మైలవరపు విశ్వనాథంవారి పెద్దల్లుడు.

విశ్వనాథంగారి యింటికీ మాయింటికీ మధ్య రెండు నివేశనాలే అడ్డు, అప్పటికి.

217

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి