Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రసాభాసం అయిపోతుం దనుకున్నది రసమహితం అయి, ప్రేక్షకుల మన్ననలున్నూ అందుకుంది, ఆ నాటకం.

నటులను దిద్దడంలోనూ, రిహార్సల్సు నడిపించడంలోనూ ప్రతీనాటకంలోనూ గ్రంథం అంతా నాకు క్షుణ్ణంగా వచ్చి వుండేది.

అంచేత, యే వేషం తక్కువయినా, నేను సద్దుకుంటూ పోయేవాణ్ణి.

ఇలా సద్దుబాటు చెయ్యడంలో, నేను, బొబ్బిలియుద్ధంలో వొకమాటు తాండ్ర పాపయ్యగానూ, వొకమాటు విజయరామరాజు మంత్రిగానూ, విజయరామరాజుగా రెండుమూడు మాట్లూ, సారంగధర చరిత్రలో రాజరాజుగా వొకమాటూ నటించవలసి వచ్చింది.

తరవాత్తరవాత, అగత్యం రాకపోయినా, రెడ్డిగా రుబలాటపడగా మరోమాటుకూడా విజయరామరాజుగా నటించా న్నేను.

మానేపల్లి కంపెనీలో, అంబటిపూడి కోటయ్యగారు చెమ్కీ యిజారూ, చెమ్కీ కోటూ, చెమ్కీ కిరీటమూ పెట్టుకుని విజయరామరాజుగా తయారయేవారు.

నల హరిశ్చంద్రాదులకూ అదే వేషం వారికి.

నా సొంతానికి నేనవి మార్చేశాను.

విజయనగరం రాజులది చుక్కబొట్టు.

కోటయ్యగారు నామాలు పెట్టుకునేవారు.

నే నదీ మార్చేశాను.

పంచె విరిచికట్టి, క్షత్రియపాగా చుట్టుకుని, దానికి తురాయి పెట్టుకుంటే చూసిన క్షత్రియులూ వోహో అనేవారు.

నా విజయరామరాజు వేషంలో, ఆ నాటకానికొక కొత్త గాంభీర్యం వచ్చిం దెవరూ అనుకోనిది.

70

మా నాటక సమాజం రమారమీ మూడేళ్ళు పనిచేసింది.

ఎన్నో నాటక ప్రదర్శనాలు జరిగించాం, ఎంతో హైరానాపడ్డాం.

బాగా డబ్బు వచ్చింది, అంతా ఖర్చయిపోయింది.

మనుష్యులం మిగిలాం, సరదా తీరింది.

కార్యనిర్వహణలో, సాహిత్యపరమైన అనుభవం నాకూ ఆర్థికమైన అనుభవం సత్తిరెడ్డిగారికీ చాలా యెక్కువగా కలిగాయి.

అది యింకా కొంతకాలం పనిచేసి వుండుమ; గాని మొత్తానికి, సత్యనారాయణగారి మడత పేచీలే మాకు విసుగు పుట్టించి విరమింపజేశాయి.

సమాజంలో యీ పేచీ లిలా వుండగా, నటుల యిళ్ళల్లో మరో రకమైన అల్లరి రేగింది.

బ్రాహ్మణ నటుల యిళ్ళల్లోనే పుట్టిందది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

207