వన్సుమోరులు తగిలాయా, అసలే చెడేది.
నటులకు ఇది గుర్తుకు వచ్చాటప్పటికి జనప్రశంసలున్నూ వారికందసాగాయి.
వారందరూ పల్లెటూళ్ళవారు, యే వొకరిద్దరో తప్పించి.
చాలామంది రెడ్డియువకులు.
కాగా, వారందరూ గంగిగోవులు.
గురి కుదిరిందా, ప్రాణాలయినా యిచ్చేరకం వారు.
దీనికి సాయం, అర్థం తెలిసీ, కొంత సంస్కారం అబ్బీ నా యేర్పాటుకు తృప్తిపడసాగారు వారు.
ఇంతేకాదు.
రెడ్డిగారూ, వారి తమ్ముడు గంగిరెడ్డి, వుచ్చారణ క్రమం సూచిస్తూ, ఏ దిక్కున చూసినా తామే అయి చక్కగా ప్రాంప్టింగు చేసేవారు.
తాదాత్మ్యంలో మరుపు కలిగితే జ్ఞాపకం చెయ్యడానికేగాని, యెలాగో వొకలాగ నాటకం "యీడ్చెయ్యడాని" క్కాదది, నటులకు.
ఎవరి గ్రంథం వారు కచ్చితంగా అప్పగిస్తేనే - రిహార్సల్సు సరిగా జరిగాకే మేము ప్రదర్శించేవాళ్ళం, ఆ నాటకం.
ఇది యిలా జరుగుతూ వుంటే, కాగితమూ పెన్సిలూ పుచ్చుకుని, ప్రేక్షకుల్లో, మొదటివరస మధ్యకుర్చీలో కూచునేవాణ్ణి నేను.
ఎవరెక్కడ పాడుచేశారో, యెవరెక్కడ బాగుచేశారో నోటు చేసుకోడాని కిది.
నాటకం అయిపోడంతోనే - ఆ వేషాలతోనే, నటులందరూ నా చుట్టూ కూచునేవారు, రంగస్థలాన.
నేను రాసుకున్నది చదివి వినిపించి మంచిచెడ్డలు వివరించేవాణ్ణి నేను.
అది చాలా మంచి ఫలితా లిచ్చింది.
అయితే, మధ్యమధ్య నేనున్నూ వేషం వెయ్యవలసి వచ్చేది, తప్పనిసరిగా.
మొదటి నాటకంలోనే తటస్థించిం దిది.
తల్లీతండ్రీ వచ్చి, గోలచేసి, సుమిత్ర వేషధారిని లాక్కుపోయా రావేళ, వేషాలు వేసుకుంటున్న స్థితిలో.
మొదటి నాటకం శ్రీరామజననం.
జయకరం అని రెడ్డిగా రేర్పాటుచేశారేగాని మా యెనిమిది నాటకాల్లోది కాదది.
శుభకరం అవుతుందన్నదే చెడే స్థితి వచ్చింది.
ఇది సభలో వున్న పెద్దకాపులకు తెలిసిపోయింది.
"ఏమిటేమి"టంటూ ఆత్రపడసాగారు వారు.
వారందరూ మాకు పెట్టని కోటలు, అంచేతే వారి కా ఆత్రం, అంతగా.
వారిని సద్దుబాటుచేసి "ఏమిటి దారి" అని నాతో ఆలోచించడానికి లోపలికి వచ్చారు రెడ్డిగారు, సుమిత్రగా వారికి నే నెదురయినాను.
దాంతో, మనసు కుదుటపడ్డమే కాదు, వెయ్యి యేనుగుల బలం వచ్చింది, రెడ్డిగారికి.
206
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1