Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

69

ఊరి కరమైలు దూరాన, యకరంనర కొబ్బరితోట కవులుకి పుచ్చుకుని, పెద్ద నాటకశాల కట్టించాం మేము.

కాకినాడ వెళ్ళి, సింగితం అబ్బాయిగారి తాలూకు తెరలూ దుస్తులూ కొనుక్కువచ్చాం.

శేషారెడ్డి అనే మంచి పెయింటర్ని స్థిరంగా పెట్టుకుని, కొన్ని తెరలు బాగుచేయించి, కొత్త తెరలు కొన్నీ సీనరీ కొంతా తయారుచేయించాం.

వారాని కొక్కటి చొప్పున నాటక ప్రదర్శనమున్నూ ప్రారంభించాం.

ఉనికి పల్లెటూరయినా, రాజమండ్రీ కాకినాడల వంటి పెద్ద పట్నాల నాటకశాలలనూ, నాటక సమాజాలనూ మించి వుండేవి మా యేర్పాట్లు.

డబ్బున్నూ బాగా వచ్చేది.

కొందరు ప్రశంసించేవారు.

కొంద రీసడించేవారు.

కొందరు దుష్ప్రచారం చేసేవారు.

కొందరు వంకలు పన్నేవారు.

అనేకులు వచ్చి చూసిపోడమే పెట్టుకున్నారు.

పొరుగూరి రౌడీలు కొందరు అల్లరి చెయ్యబోయారు; గాని మొదటినాడే అది సద్దణిగిపోయింది.

కాని నటుల అల్లరిమాత్రం సాగింది, కొన్నాళ్ళు.

నాటకాల్లో, సగానికిపైగా నేను పద్యాలు తగ్గించేశానని వారి అల్లరి.

పది పాటలు కావాలంటే రెండో మూడో మాత్రమే చేరుస్తున్నాననిన్నీ వారి గోల.

రంగస్థలం అంతా సంగీతంతో నింపెయ్యడం యెప్పు డెప్పుడని యెదురుచూస్తూ వుండిన బుచ్చిరాజుగారున్నూ యిందుకు చాలా నిరుత్సాహపడ్డారు.

అసలు, ఎనిమిది నాటకాలే మే మెంచుకున్నాం.

వాటిలో, కాళ్ళకూరి సాంబశివరావుగారి రంగారాయ కదనసమవాకారం ప్రధానం.

అనుకున్న ప్రకారం వరసగా అవి ఆడించేశాం.

సాధారణంగా నాటక సమాజాలవా రేమి చేస్తారో చూడాలేదు, వినాలేదు; కాని నేను మాత్రం నటుల కందరికీ నాటక కథ బాగా బోధపరిచేవాణ్ణి ముందు.

పుస్తకం సావకాశంగా చదివి వినిపించేవాణ్ణి, తరవాత.

ఎక్కడ వూది పలకాలో, ఎక్కడ తేల్చాలో, ఎక్కడ చటుక్కున అందుకోవాలో, ఎక్కడ నాన్చెయ్యాలో, ఎక్కడ దురితంగా పలకాలో, ఎక్కడ విశేషం స్ఫురింపచెయ్యాలో - ఇలాంటివి సూచిస్తూ చదవడంవల్ల పాత్రలు బాగా బోధపడేవి, నటులకు.

అదంతా బాగా పలికించడంతో కథ వంటబట్టేది, వారికి.

తెరపి మరపుల స్థితిన్నీ అప్రయత్నంగా యేర్పడేది.

అయితే, పద్యమో పాటో యెత్తుకుంటేమాత్రం ఆ స్థాయి పోయేది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

205