విశాఖపట్నంలో తాము చదువుకునేటప్పుడు, శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు ఆడించిన కొన్ని నాటకాలు చూసి వుండినారుట ఆయన.
నేనుకూడా కొన్ని నాటకాలు చూసి వుండినా, వొక నాటకమున్నూ రచించేవుండినా లాభం లేదుట - కారణం నా కింగ్లీషు రాకపోడంట.
ఈ యింగ్లీషు చదువుకున్నవాళ్ళ కందరికీ యిదొక బడాయి, ఇప్పటికీ చూస్తూనే వున్నా న్నేను.
అది యేమయినా, వారికందరికీ రెడ్డిగారిమాట వేదవాక్యం.
మరి, రెడ్డిగారికి?
నా మాట వొక్కటే మాట.
కిక్కురుమనలేకపోయారు, సత్యనారాయణగారు.
వచ్చిన అవకాశం జారవిడుచుకోడం మంచిది కాదని నా వడపోత కంగీకరించారు, నటులున్నూ, చివరికి.
నటు లన్నాను, నిజమే, ఆ మాట వారిలో యే యిద్దరికో ముగ్గురికో మాత్రమే చెల్లుతుంది.
నాటకానికి పాటకుడు పనికిరాడంటే అందరికీ వింతే.
అప్పటికీ యిప్పటికీ యిది యింతే.
తక్కిన హిందూ ప్రాంతాలమాట నాకు తెలియదు, మన తెలుగుదేశంలో మాత్రం ఆదినుంచీ సంగీత నాటకాలే వెలిశాయి.
వచనం కవిత్వానికే పనికిరాకపోయింది మనవారికి, నాటకాల కెలా పనికివస్తుందీ యిక?
ఇంగ్లీషు సంపర్కం బలిశాక రచించబడుతున్న నాటకాల్లో గూడా సంగీతానికే ప్రాధాన్యం.
భరత శాస్త్రాని కనుగుణాలయిన దరువులూ కందార్థాలూ పోయి, హిందూస్థానీమట్లు వెలిశాయి, అంతే భేదం.
నాకూ పట్టింది యీ పిచ్చి వారకాంత రచనలో; కాని తరువాత కొద్ది దినాలకే నా అభిప్రాయం మారిపోయింది.
ఇప్పటికీ మన నాటక కర్తలకు పద్యవ్యామోహం తగ్గలేదు.
నాటకం అంటే, కవితా గాన చిత్రకళల సమ్మేళనం"ట" మరి.
కథా సంభాషణా నటనా వారి కప్రధానాలు.
అలాంటివారు రచించిన నాటకాలకు సమగ్రసౌష్టవం యెలా వస్తుందీ?
అయినా, చూడ్డానికి జనులకూ, ఆడ్డానికి నటులకూ నాటకా లనబడేవి కావాలి.
ఇలాంటి అగత్యమే వచ్చింది, నాకూ రెడ్డిగారికిన్నీ.
అయితే, వస్తుతః, మాకు తెలిసిందే తక్కువ.
తెలిసిందయినా ఆచరణలో పెట్టే శక్తిన్నీ తక్కువే.
అయినా, మేము ముందుకే వెళ్ళిపోయాం, సాహసించి.
204
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1