Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి నాటకాల్లో కాళ్ళకూరి సాంబశివరావుగారి రంగారాయ కదనసమవాకారం (బొబ్బిలియుద్ధం) రోజు విడిచి రోజు తప్పకుండా వుండేది.

చిత్రనళీయమున్నూ అంత తరుచుగానూ వుండేది.

అసలు, చిత్రనళీయం ఆడగలిగితేనే అది నాటకసమాజం, లేకపోతే కుర్రకుంకల జట్టే, ఆ రోజుల్లో.

మానేపల్లి కంపెనీలో, ముప్పిడి జగ్గరాజుగారూ, అంబటిపూడి కోటయ్యగారూ ముఖ్యనటులు.

కోటయ్యగారికి అభినయచాతుర్యం చాలా తక్కువ, కర్ణాటకం బహుశ్రావ్యంగా పాడేవా రాయన.

ఆయనకు రెండు మూడు వందల కృతులు వచ్చునని బాగా ప్రతీతి.

ఫిడేలు బహు నాజూకుగా వాయించేవా రాయన.

మాంచి నడివయస్సు కనక, జగ్గరాజుగారిది, అప్పటి రూపమే రూపమూ, అప్పటి అభినయమే అభినయమున్నూ.

మల్లమ్మగా, దమయంతిగా, చంద్రమతిగా, యేదో వొక ప్రహసనంలో రంగేళీ విటకత్తెగా చూశాను ఆ సందర్భంలో నే నాయన్ని. అక్కడి కక్కడే అందుకోసమే పుట్టినట్టు మారిపోయేవా రాయన.

పుష్కరాలు సగం గడిచాయి, నేను కవినని జగ్గరాజుగారికీ, జగ్గరాజుగారు నటులని నాకూ అరవ ఆదినారాయణమూర్తిగారు పరిచయం చేశారు తమ షాపులో వొకనాడు.

అది మూలంగా, జగ్గరాజుగారు నాకు బాగా పరిచితులయినారు, తరవాత.

ఆ పన్నెండు దినాలూ నాటకాలు చూడ్డంలో, నటనకు మాత్రమేకాక, రచనకున్నూ సంబంధించిన రంగస్థల విషయాలు కొన్ని తెలుసుకున్నా న్నేను, జగ్గరాజుగారి సాయంతో.

ఆ మండపేట నాటకాల కథాసంగ్రహాలు చదివివుండడమూ, యీ మానేపల్లికంపెనీ నాటకాలు చూసివుండడమూ - ఈ రెండు కలిశాటప్పటికి, నాకున్నూ నాటకాల వ్యామోహం పట్టుకుంది, దిట్టంగా.

అయితే, ఆ వ్యామోహం, బుచ్చిరాజుగారికి నాటకాలాడాలన్న అభిలాష కలిగించగా, నాటకాలు రచించాలన్న ఉత్సాహం కలిగించింది, నాకు.

ఈ స్థితిలో కలుసుకున్నాం నేనూ, బుచ్చిరాజుగారూనూ.

బుచ్చిరాజుగారికి కానడరాగం అభిమానం.

చాలా బాగా పాడేవా రది ఆయన.

ఒకనా డది విడిగా పాడుతూనే అరిటాకులు కోశా రాయన, నాకోసం.

ఆ మాధుర్యం గుర్తించి నేను కోరగా, ఆ పని అయాక కూచునిన్నీ మళ్ళీ పాడారది.

ఒక కందం, వొక గీతం, వొక ఆటవెలది, వొక మత్తకోకిల, వొక ఉత్పలమాల, వొక శార్దూలం, వొక సీసం - ఇన్ని పద్యాలమీద ప్రస్తరించా రాయన, నేను కోరగా అది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

201