దేవతలే దిగివచ్చి మండపేటలో నాటకా లాడిపోతున్నారన్నట్టు చెప్పుకునేవారు, లోకు లప్పుడు.
పండితులూ వేదం చదువుకున్నవారూ కూడా వెళ్ళి చూశారు చాలామంది ఆ నాటకాలు, నాకు బాగా తెలుసు.
అందుకు పర్యవసానంగా, లక్షరూపాయలకు పైగా కొల్లగొట్టుకుపోయా రక్కణ్ణుంచి, ఖర్చులు పోను ఆ కంపెనీవారు.
అయితే, డబ్బె౦త పట్టుకుపోయినా, ఆ గ్రామాలవారికి మంచి నాటకాభిరుచి కలిగించే పట్టుకుపోయారు, పాపం వారు.
అతిశయోక్తికాదు, ఆ నాటకాలు చూడ్డంతో, ఆ గ్రామాలవారిలో చాలామంది సాహిత్యప్రియులయినారు.
నాటకాల ఆంతర్యమే కాదు, స్థాయీ తెలుసుకున్నారు.
వారిలో చాలామంది మంచి విమర్శకులయినారు.
తరవాత కొంతకాలం దాకా మండపేట గ్రామం నాటకాల పీఠంగా చెలామణీ అయిపోయింది.
జిల్లాలో యెక్కడ నయినా నాటక సమాజం వెలిసిందా, అది ఆ నాటకాల ప్రసాదమే.
ఇంతేకాదు, -
ఆ కొత్త కంపెనీలవారు, మొట్టమొదట మండపేటలో నాటకా లాడవలసిందే, లేకపోతే వుప్పు పుట్టేది కాదు.
ఆ ఖ్యాతిలో యెంద రెందరో వచ్చి అక్కడ నాటకా లాడేవారు; కాని ద్రష్టల విమర్శలు తట్టుకోలేక వొకటిరెండు నాటకాలతోనే స్వస్తిచెప్పుకుని వెళ్ళిపోయేవారు.
అవీ యివీ కూడా అన్ని నాటకాలూ చూసిన రాయవరం గ్రామస్తుల్లో మల్లిడి సత్తిరెడ్డిగారూ, విలపర్తి బుచ్చిరాజుగారూ ముఖ్యులు.
అవి అంత ఆబగా చూడ్డంవల్లనే, మొదటమొదట నాటకాలూ, వాటినిపట్టి సాహిత్యాభిరుచి కలిగి, దృఢపడి, తరువాత నవలలూ, కథలూ, ప్రబంధాలూ మొదలైనవి చదవడం అలవాటయింది, రెడ్డిగారికి.
బుచ్చిరాజుగారికి మాత్రం లేశమూ సాహిత్యవాసన తగల్లేదు, గానాభిరుచీ ప్రవేశమూ మాత్రం పెరిగిపోయాయి.
దాంతో, అయన శాస్త్రీయసంగీతంలో కూడా అడుగు పెట్టారు, కొంచెం.
ఫిడేలు గోకారు.
అంచేత, రెడ్డిగారికి, నాటకాలు చూడ్డం వ్యామోహమే గాని, బుచ్చిరాజుగారికి నాటకాలాడ్డం వ్యామోహమే పట్టుకుంది, ముమ్మరంగా.
ముదిరిన్నీ పోయింది.
మండపేట నాటకాలు చూడలేదు; గాని, కీలకసంవత్సర పుష్కరాల సందర్భంలో, రాజమహేంద్రవరంలో, పన్నెండు రోజులూ నేను నాటకాలు చూశాను.
అక్కడ - అంటే ఈ రాజమహేంద్రవరంలో, ధరణీప్రగడ సూరయ్యగారి మానేపల్లి కంపెనీ ప్రభ బాగా వెలుగుతోంది, ఆ రోజుల్లో.
200
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1