Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిక్కడ వుండినంత కాలం అయినా?

ఇదీ గమనించరు వారు.

పోనీ, గుజరాతీలూ, బెంగాలీలూ, షేర్వాణీల సొంతదారులైన ముస్లిములూ తమ జాతీయవేషం విడిచి షర్టూ కోటూ పంట్లామూ తొడుగుతారేం యెందరో?

తాము వారి ఉచ్ఛిష్టం స్వీకరించి, సర్వజనీనమైన డ్రెస్సు, శీతవాతాతపాల కనుగుణం అయినంతవరకూ అవలంబించినవారిని కాదనడం యేమి ప్రాజ్ఞత?

67

అంతకితం యేడెనిమిది సంవత్సరాలనాడు, కోలంక వీరవరం వగైరా యెస్టేట్ల జమీందారు శ్రీ రావు చెల్లాయమ్మారావుగారి ఆదరాభిమానాలతో, కొందరు నటులు శ్రీ సత్యనారాయణ నాటక కంపెనీ అన్నపేరితో వచ్చి వారానికి రెండు చొప్పున ఆరు మాసాలపాటు ఏమి టేమిటో నాటకాలాడి వెళ్లిపోయారు, మండపేటలో.

ఆ నటుల్లో, చిరకాలం - అవసానం దాకా ఆంధ్రపత్రిక సంపాదకీయవర్గంలో వొకరయివుండిన శ్రీ వెదురుమూడి శేషగిరిరావుపంతులుగారు, ముఖ్యుల్లో ముఖ్యులు.

అప్పటికి రఘువంశం చదువుతున్నాను మా పెద్దన్నగారి దగ్గిర నేనింటోనే.

బుధవారమూ శనివారమూ తెల్లవారడం భయం, తొమ్మిదీ - పదిగంటలమధ్య, టముకువేసే మనిషికోసం వీధి అరుగు అంటిపెట్టుకుని వుండేవాణ్ణి.

కార్లూ లేవు జట్కాలూ లేవు, చెవులు బద్దలుకొట్టే బాండువాద్యం అసలే లేదు, పంచము డొకడు డప్పు వాయించుకుంటూ వచ్చి కాగితాలు పంచిపెట్టేవా డారోజుల్లో.

తన కేవూళ్ళు నిర్ణీతాలో, ఆ వూళ్ళలో తాను టముకు వేసినట్టు పెద్దమనుష్యులచేత సంతకాలు చేయించుకునేవా డామనిషి.

పొలమూరికల్లా పెద్దమనిషి న్నేను, నాలుగైదు వారాలు గడిచే టప్పటికే కనిపెట్టేశా డామనిషి, నా శ్రద్ధాసక్తులు.

ఆ ఆరు మాసాలూ, వారానికి రెండు చొప్పున అన్ని నాటకాల నోటీసులూ సంగ్రహించా న్నేను.

డెమ్మీ షీటు మూడుముక్కల సైజులో, కథాసంగ్రహం అంతా, అంకాలవారీగా ముద్రింపించేవా రానోటీసుల్లో, ఆ కంపెనీవారు.

అవన్నీ సుందరకాండ అన్నట్టు పారాయణ చేసేవాణ్ణి నేను, దినమ్మూ.

కానయితే, వొక్క నాటకమూ నేను వెళ్లి చూడలేదు, అయినా, జిహ్వాగ్రాన వుండేవి ఆ కథలన్నీ నాకు.

పుస్తకం పుస్తకంగా ఆడేసేవా రాకంపెనీవారు, నాందీ ప్రస్తావనలు కూడా విడిచిపెట్టకుండా.

వీధి భాగవతాలూ, తోలుబొమ్మలాటలూ, గొల్లభామ కలాపాలూ మాత్రమే యెరిగి వుండిన ఆ చుట్టుపట్ల యాభై అరవై గ్రామాలవారికీ, ఆ ఆరుమాసాలూ ఆ నాటకాల విషయమే శ్రీరామమయం అయిపోయింది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

199