Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవేళ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగా రధ్యక్షత వహించవలసివుండింది.

కారణాంతరాలవల్ల వారు రాలేకపోగా, భారతి ఆఫీసులో శ్రీ రంగాచారిగారితో మాట్టాడుతూ కూచుని వుండిన నన్ను, అందుకొప్పించి తీసుకువెళ్లారు, శక్రటరీ నరసయ్య (?) గారు.

అయితే "అయిదేళ్ళపాటు ఏ సభలోనూ వుపన్యసించగూడ"దని వొక నియమం పెట్టుకుని వున్నాన్నే నప్పటికి.

మొదటా చివరా కూడా నే నేమీ ఉపన్యసించకుండా వుండే పద్ధతి మీదే తీసుకువెళ్ళారు, శక్రటరీగారు నన్ను.

కాగా, నేను ముందు పొడిమాటలతో కార్యనిర్వహకులకు కృతజ్ఞత చెప్పి, తరవాత, వక్తలయిన శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారిన్ని, శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారినీ టూకీగా సభకు పరిచయం చేసి, చివరి మళ్ళీ క్లుప్తంగా వందనాలు చెప్పి వూరుకున్నా నా వేళ.

ఆ సభలో తారసపడ్డారు, వేంకటేశ్వరరావుగారు.

పార్శీకాలరు - ఇంగ్లీషుకలరు - కోటు తొడుక్కుని మరీ వచ్చారు, వా రాసభకు.

వారూ గుర్తించుకునే వుంటారు, ఆ కోటుతో వారి కొక నిండూ, వొక ఔజ్వల్యమూ వచ్చివున్నాయి.

నిజమే; కాని కోటు తొడుక్కుని వుండినందుకే, నన్నొకనాడు హేళవ చేసినవారే కోటు తొడుక్కోడం వింత కాదూ?

అయితే, గుజరాతీల ఆఫీసులో పనిచేస్తూ వుండినందున కోటు తొడుక్కోవలసిన అగత్యం యేర్పడి వుంటుంది వారికి, ఎంత యిష్టం లేకపోయినా.

కాలం - కాలచక్రం గిర్రున తిరిగిపోతుందిగాని నిలకడగా వుండదు, మరి.

జాతికి జాతినే మార్చేస్తుందది, వొక్క వ్యక్తి లెక్కేమిటి దానికి, సాధారణంగా ?

గుర్తించుకోగలిగితే - సత్యం అంగీకరించగలిగితే - ఉద్రిక్తులం కాకుండానూ వుండగలిగితే - మనం అందరమూ మారాం.

చాలా చాలా మారాం.

తలొక మోస్తరూను, అంతే భేదం.

ఈ మార్పు మాత్రం యేకత్వానికే, భిన్నత్వాని క్కాదు.

హలం విడిచి కలం చేతబట్టారు, వేంకటేశ్వరరావుగారు.

స్రుక్సువాలు విడిచి కలం చేతపట్టా న్నేను.

ఒక్క తాటిమీద లేమూ, నేనూ వారూను, ఇప్పుడు?

ఆంధ్రత్వానికి సమగ్రత సాధించి, దాల్లో భారతీయత రూపొందించడాని క్కాదూ, భుజమూ భుజమూ రాసుకుంటూ పనిచేస్తున్నది, నేనూ వారూను ఇప్పుడు?

నిరంతర సాధనతో నాలో పరిణతి యేర్పడ్డది మొదలు, ఇదీ నా ధోరణి.

ఉపాధి భేదంతో తప్పనిసరిగా భిన్నభిన్నం అయిన వ్యష్టిరుచితో సమష్టిప్రాప్యం భగ్నం చేసుకోడం నా పద్ధతి కాదు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

197