Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రపత్రిక ఆఫీసు దాటి, ఆనందవాణి ఆఫీసు దగ్గిర నడుస్తున్నాను.

మిత్రులు శ్రీ నార్ల వేంకటేశ్వరరావుగారూ, కప్పగంతుల సత్యనారాయణగారూ తారసిల్లారు, ఎదురుగా వస్తూ.

కుశలప్రశ్నాదికం అయింది.

"ఏం వచ్చారు?" అనడిగారు, సత్యనారాయణగారు.

నే నింకా బదులు చెప్పలేదు "రేడియోకి అయివుంటుంది" అన్నారు, వేంకటేశ్వరరావుగారు.

ధర్మమే వారలా అనుకోడం, ఆ ప్రారంభదినాల్లో మద్రాసు రేడియోలో తరుచు ప్రసంగించేవారు, వారేమి టేమిటో.

కొందరు రచయితలకున్నూ మద్రాసు వెళ్ళడాని కప్పుడదే కారణం.

"విన్నకంఠాలే మళ్ళీ మళ్ళీ వింటున్నాం, మారుపేర్లతో" అంది ఆంధ్రభూమి పత్రిక, అంతకితమే, కొందరిని మనస్సులో వుంచుకుని.

నాకున్నూ అడపాతడపా ఆహ్వానాలు వస్తున్నా యప్పుడప్పుడే, వెళ్ళడానికిమాత్రం మనస్కరించడంలేదు.

వెళ్ళకూడదనిన్నీ అనుకున్నా నొకవిధంగా.

సత్యనారాయణగారు తమ ధోరణి సాగిస్తూనే వున్నారు. నేనూ మాట్లాడుతూనే వున్నాను వారితో.

ఏమి తోచిందో మరి "మీ కెన్నికోట్లున్నాయండీ ?" అనడిగారు వేంకటేశ్వరరావుగారు, నన్ను, మా సంభాషణకి అడ్డంవచ్చి హేళనగా.

“తెనుగువాళ్ళలో కోటీశ్వరులయినవాళ్లున్నట్టులే దెవరూ, నాకు మాత్రం బహువచనం మీదే వున్నాయి కోట్లు," అని బదులు చెప్పాను దానికి, సాదరంగా.

అప్పటికింకా వోపెనుకోట్లే తొడుగుతున్నాను, అవంటే వారికి మరీ వెగటులా కనబడింది.

పూర్వావస్థ మాటకేం, అప్పటికి కద్దరు లాల్చీధారులు, వారు.

ఒక సెలవిలో కొత్తసిగరెట్టు అంటించి పెట్టుకునే రెండో సెలవిలో వున్న పాతసిగరెట్టు తీసిపారేసేవా రున్నారు మనలో, నే నెరుగుదును.

“చెయిన్‌స్మోకింగు” అంటారుట దీన్ని ఇంగ్లీషులో, మిత్రులు పురిపండా అప్పలస్వామిగారు చెప్పారు మొన్నమొన్ననే, దీని అముద్రితప్రతి వింటూ.

కానైతే, వెంకటేశ్వరరావుగారిదీ ఆ పద్ధతే, నే నెరుగుదును.

కాల్తూ కాల్తూ వున్న సిగరెట్టుతోనే ఫొటోదిగుతారు కూడా, వేంకటేశ్వరరావుగారు.

ఇవాళ చూస్తేకూడా వేంకటేశ్వరరావుగారి యింటో వున్నన్ని యింగ్లీషు (నాటక వాఙ్మయం) పుస్తకాలు, ఏ యింపీరియల్ లైబ్రరీవంటిదాల్లోనో తప్ప కనబడవుట, వారే చెప్పారు, నన్ను తీసుకువెళ్ళి చూపిస్తూ వొకనాడు.

ఇంతకీ, -

తరవాత - కోట్ల ప్రస్తావన జరిగిన కొన్నాళ్ళకి -గోఖేలు హాల్లో తారసపడ్డా రొకనాడు, వేంకటేశ్వరరావుగారు నాకు.

ఆంధ్ర విద్యార్ధి విజ్ఞానవారోత్సవాల సందర్భం అది.

196

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1