ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించుకున్నాను.
మానసిక బాధ యెలా వుంటుందో ఆయనకు రుచి చూపించాలని నిరుకుచేసుకున్నాను.
ఆ గదిలో చిలకకొయ్యని వేలాడుతోంది, ఆయన కోటు.
వీరభద్రావతారం తాల్చేశాను, వెంటనే.
మా అమ్మగారి పెట్టెలో వున్న కత్తెరతీసి జానెడుపైగా ఆ కోటు వీపు కత్తిరించేశాను, నిలువుగా.
నాకు మళ్ళీ దెబ్బలు తగిలాయనుకోండి.
మా అమ్మగారున్నూ కోప్పడ్డారనుకోండి, చాలా.
నాకు మాత్రం కొంత తృప్తి అయింది.
విద్యలు నేర్చినా, నేర్చకపోయినా, వైదికుల కందరికీ చొక్కాలంటే మహా మంటగా వుండే దప్పుడు.
అయితే, పొలమూరిలో, నియోగులయిన మున్సబుగారి తమ్ములతో సాహచర్యం నాకు చిన్నప్పుడు.
వా రెప్పుడూ చొక్కాలు తొడుక్కునే వుండేవారు.
చిత్తవృత్తి మారడం - వైదికవిద్యలంటే ప్రాతికూల్యం యేర్పడ్డం - ఇలాంటి సాహచర్యం - దీంతో చొక్కాల వ్యామోహం ప్రారంభం అయిపోయింది, అప్రయత్నంగా నాకు.
పెద్దపెరిగి, ఒక నాటకం రచించి, అచ్చున్నూ వేయించి, స్వార్జితం కొంత డబ్బు చేతికి రావడం ప్రారంభం కావడంతో అది దుర్భరమే అయిపోయింది.
66
వెనకటిమాట అలా వుంచుదాం.
వైదికుల సంగతి కూడా అలా వుంచేద్దాం.
షర్టన్నా కోటన్నా, మనలో కొందరి కిప్పుడు వల్లమాలిన ద్వేషం, లౌక్యుల్లోనే.
అవి తొడగడం యింగ్లీషువాళ్ళ ననుకరించడం అవీ, అచ్చంగా భావదాస్యం అనీ వారి భావన.
సొంతానికి ధర్మనిర్ణయశక్తి లేకపోడంవల్ల అనుకరణ పరాయణులకు కలిగే భ్రాంతి యిది.
క్రాపింగులు పెంచుకుంటారు, సిగరెట్టుమీద సిగరెట్టు వూదేస్తారు, తమలోతా మింగ్లీషులోనే మాట్టాడుకుంటారు మళ్లీ, షర్టూ కోటూ అంటేనే విజాతీయత జ్ఞాపకం వస్తూంది, వారికి చట్టున.
వారి అభిజాత్యమున్నూ దెబ్బ తింటుంది, గాఢంగా.
పెద్దలు నలుగురూ చేరి "జాతీయమైన వేషం యిదీ" అంటూ సరసమైన నిర్ణయం చేసేదాకా యెవళ్ళ రుచి వాళ్ళదీ అనయినా అనుకోరు వారు.
ఊరూకోరు.
తంబుచెట్టివీథే వెడుతున్నా వొకనాడు నేను మద్రాసులో.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
195