Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీంతో, అభిమానం ముంచుకువచ్చింది మా నాయనగారికి, చర్రుమన్నారు నామీద.

మా నాయనగారికి వచ్చిన అభిమానమే మా అమ్మగారికీ వచ్చింది, అంతకంటే యెక్కువగా.

అయితే, రకం మాత్రం వేరు.

కారణమూ వేరే.

మాటపడే స్వభావం కా దామెది, సహజంగా.

దీనికి సాయం, నచ్చ జెప్పవలసిన మా అక్కగారే మా నాయనగారికి ఆగ్రహం రేపెట్టడం.

అది మా అమ్మగారికి మరీ బాధ అనిపించింది.

"మరి నీ కొడుకు తొడగడం లేదూ?” అంటూ మా అక్కగారి మీద కస్సుమన్నా రామె, వెంటనే.

“మనమణ్ణి ముద్దుపెట్టుకుంటారేం, మరీ?" అంటూ మా నాయనగారినీ యెదురడిగారు.

“ఇద్దరూ యిద్దరే, వొక్కడికయినా బుద్ధి వుంటేనా కాస్త అయినా?” అంటూ రుంజుకున్నారు, మా నాయనగారు.

“నా కొడు కింగ్లీషువాడు, ఎరుగుదువా?” అంటూ నిలవతీశారు, మా అక్కగారు, దానిమీద.

"నా కొడుకు కవీశ్వరుడు, తెలుసా?" అంటూ డీకున్నారు, మా అమ్మగారు, దురుసుగా.

ముగ్గురూ కొంచెం కీచులాడుకున్నారు.

నేనుమాత్రం వింటూ చూస్తూ వూరుకున్నాను.

తరవాత రెండు రోజుల దాకా నామీద కొరకొరలాడుతూనే వున్నారు మా పెద్దక్కగారు, మా నాయనగారు మాత్రం ఆ మాటే యెత్తలేదు, మళ్ళీ.

అది గ్రహించి బెదురుతీరి, ధారాళంగా చొక్కాలు తొడుక్కోసాగాను, తరవాత నేను.

మా చిన్నన్నగారికీ వుంది, చొక్కాలమీద తీవ్రప్రాతికూల్యం యిప్పటికీ; కాని, అంతక్రితం బంధువుల యింటో శుభకార్యా లయినప్పుడు తొడుక్కోవచ్చునని వొక కోటు కుట్టించుకున్నా రాయన, ఆ చిన్నతనాన.

అమరం వల్లించడం లేదని గట్టిగా కొట్టా రొకనాడు, న న్నాయన.

నవారుబద్దీతో కొంతసేపు వసారా స్తంభానికి కట్టివేశారు.

అప్పటికీ ఆగ్రహం తీరక, గదిలో పెట్టి బయట గొళ్లెం వేశారు కొంతసేపు.

నా కిష్టం లేని చదువుకోసం నిర్బంధించడం - సాటివాడు కట్టివెయ్యడం, చెరబెట్టడం - ఎవరికయినా బోధపడుతుంది, దుర్బలుని పరిస్థితి.

నా కభిమానం వచ్చింది.

ముంచుకునే వచ్చేసింది బాగా.

అశ్రుపూరితనేత్రుణ్ణల్లా రోషకషాయితనేత్రుణ్ణయిపోయాను, గదిలో.

194

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1