"ఇలాంటివి నేనింకా చాలా కల్పించా"నంటూ మరికొన్ని పేర్లు చెప్పా రొకనాడు, నాకు.
1. హిందూమాత వృత్తం.
2. విక్టోరియా వృత్తం.
3. లాలా లజపతిరాయి వృత్తం.
4. సురేంద్రనాథ బెనర్జీ వృత్తం -
ఇత్యాదిగా అవి పన్నెండు.
ఇవే నాకియ్యగా “వారకాంత" నాటకంలో చొప్పించేశా న్నేను.
పాతది సరిగా తెలియకపోడమే యీ ప్రవృత్తికి కారణం.
అయితే, యీ వ్యామోహం నాకా వొక్క నాటకంతోనే చెల్లిపోయింది.
ఆయన చెప్పిన రెండోసలహా, నాటకం అచ్చువేయించమని.
"కాగితాల వెల తెచ్చి యిస్తే, తక్కిన బిల్లు నింపాదిగా తీర్చుకునే పద్ధతిని, పుస్తకం అచ్చువేసి యిస్తా"మన్నారు సత్తిరెడ్డిగారు.
ఆ ప్రారంభావస్థలో నాకంతా పొంగే, అంతా వుత్సాహమే.
సరదా పుట్టింది.
అది తలమునక లయింది.
“కవీశ్వరుణ్ణయిపోయాక యింకా మూలపడి వుండడం యేమిటీ?" అంటూ ఆత్రం ప్రారంభం అయింది.
అప్పు డప్పుడు జాతకాలూ అవీ చెప్పి నేను సంపాదించింది మొత్తం నా సొంత డబ్బు మా అమ్మగారి దగ్గిర యాభై రూపాయల దాకా వుండింది, ఖర్చు అయింది పోగా.
చిన్నదో పెద్దదో వొక మొత్తం నా దగ్గిర అంతకాలం నిలవ వుండడం అప్పుడే - నేటివరకూ మరి తటస్థించలేదు.
లేదని విచారమూ లేదు.
కవిత్వం ప్రారంభించాను, అంతే, కవితావ్యాసంగానికి భంగం రాకుండా దినాలు గడిచిపోతే చాలునన్న దృష్టి యేర్పడిపోయింది, స్థిరంగా నాకు.
"ఒక్క పద్యం కడితే చాలదూ, వంద రూపాయ లెందుకూ" అని అప్పుడూ "వొక్క వాక్యం చాలదూ, వెయ్యి రూపాయ లెందుకూ?" అని యిప్పుడూ నా తృప్తి.
ఇది అన్నం పెట్టదు నిజమే; మరి, యిది కలిగించే ఆనందం యెన్ని కోట్లయినా డబ్బు కలిగించగలదా?
అసలు, డబ్బుకీ ఆనందానికీ సంబంధం యేమిటీ?
డబ్బు భౌతికం.
ఆనందమేమో ఆధ్యాత్మికం.
ధనికు లనుభవించేది ఆనందం కాదు, సుఖమైనా కాదు, లాలసత అది.
డబ్బు అంతస్థుని బట్టి అది హెచ్చుతూ వుంటుంది, తగ్గుతూనూ వుంటుంది, గాలి విసురులాగ.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
181