Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రాత్రే పడవ యెక్కాను.

అనపర్తి దగ్గిర నల్లకాలవ బల్లకట్టు ఎక్కాటప్పటికి తటవర్తి వేంకటరాజుగారు కలుసుకున్నారు.

ఎందుకో మందహాసం చేశా రాయన,

"ఏం, వచ్చేస్తున్నావేం?" అనిన్నీ అడిగారు.

జరిగింది చెప్పా న్నేను.

"వెర్రిబ్రాహ్మడు" అంటూ వొకమాటు నవ్వేసి “తెనుగు కవిత్వం మీ కుటుంబ సంప్రదాయానికి మచ్చ అయితే, ప్లీడరు గుమాస్తా పని భూషణమా అనడిగా న్నేను. గుక్క తిప్పుకోలేకపోయారు మీ నాయనగారు. 'ఇది మీరు ద్వేషించడం కిందే లెక్క అవుతుంది. అవతలివైపున కూడా ద్వేషం పుడుతుంది చివరికి, తెలుసా?' అనిన్నీ అడిగాను. అప్పుడే నా యెదటే నీకూ ప్లీడరుగారికీ కార్డులు రాశారు, మీ నాయన. గ్రామనౌకరుచేత నేనే పోష్టుకి పంపించానవి" అని వివరాలు చెప్పారు వేంకటరాజుగారు.

"నిరాఘాటంగా యిక నేను కవితాసాధన చేసుకోవచ్చునటనా?" అనడిగాను, దీనిమీద నేను.

“నా వుద్దేశం, మీ నాయనగారు, ఇక చూసీ చూడనట్టుంటూ వుంటారని. నువ్వయినా, మోతాదు తప్పకుండా మసులుకోడం మంచిది" అని బదులు చెప్పా రాయన.

"గొప్పవాడి వయిపోవాలి నువ్వు, సగంసగం అయితే వొప్పుకోను, తెలుసా?” అంటూ ముందు ముక్తాయించి, దారి పొడుగునా నా కుల్లాసం కలిగిస్తూనే వుండినారు కూడా ఆయన.

60

నా కవితావ్యాసంగాని కెక్కువ అవకాశమే దొరికింది, పోలవరంనుంచి వచ్చాక.

ఎంత నిషేధించినా నే నది మానకపోడమూ, మా చిన్నన్నగారి పితూరీలు తప్పిపోడమూ, కొత్త పంచాంగాలతో మా నాయనగారికి వార్షికాలకోసం తరుచు సంచారం చెయ్యవలసిరావడమూ యిందుక్కారణాలు.

పద్యం తప్ప నొక్క బంతి అయినా వచనం రాయలేదీ అవకాశంలో నేను.

ఆ పద్యాల విషయంలో వొక వింత సంగతి.

నాకా దినాలలో, వొక్క అయినాపురపు సుందర రామయ్యగారితో మాత్రమే కవితావ్యాసంగం.

ఆదయినా, రాయవరంలో కలుసుకున్నప్పుడే.

అయితే, ఆ కొద్దిపాటి సాహచర్యంలోనూ కవిత్వం విషయమై యేమి టేమిటో సలహాలు చెప్పారు, నా కాయన.

వాటిలోదే పద్యాల విషయం.

ఏదో పూర్వవృత్తం వొకటి పుచ్చుకుని, వేంకటరమణ వృత్తం అంటూ పేరు మార్చి, తమ గ్రంథాలలో ధారాళంగా వాడుకునేవా రాయన.

180

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1