Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్లక్ష్యం చెయ్యడం మంచిదో ఆలోచించుకోండి" అన్నారు ప్లీడరుగారు, కక్షిదారుతో.

ఆ కక్షిదారు ముఖకవళిక యిప్పటికీ నాకు బాగా జ్ఞాపకం.

“అయినాసరే, పడేసెయ్యండి" అన్నా డాయన, ముందు.

పక్కకి చూస్తూ ఆలోచించాడు, తరవాత.

"మీ సలహా యేమిటి?" అనడిగాడు, ఇటు తిరిగి.

"ఖర్చులు దండుగ, కసి తీరదు. ఆయన నాకు స్నేహితుడు, నిజమే. నేను వృత్తిధర్మం పాటించుకోవాలి, మీకు ద్రోహం చెయ్యను" అని వూరుకున్నారు, ప్లీడరుగారు.

ప్లెయింటు చేతపట్టుకు నుంచున్నాడు మా సోమప్ప, చెల్లించి చూస్తూ.

క్రోధం విసుగయింది, విసుగు కంగారయింది, కంగారు గొణుగుడయింది, గొణుకుడున్నూ “పది రూపాయలు పుచ్చుకుని చెల్లు రాయించండి పోనీ" అన్నమాట అయిపోయింది కక్షిదారుకి, చివరికి.

ఊరుకున్నవాళ్ళనే కోర్టుకి పడలాగుతారు ప్లీడర్లు.

పైని న్యాయాధికారి వుంటాడు, అయితే, ఆయనా మనుష్యమాత్రుడేగా?

కాగా, కోర్టుకి వెళ్ళేది న్యాయమూ కాదు, అన్యాయమూ కాదు - రాగమూ ద్వేషమూను.

కోర్టునుంచి మళ్ళీ బయటికి వచ్చేవిన్నీ ధర్మమూ కాదు అధర్మమూ కాదు, దుఃఖమూ దారిద్రయమూను.

కాని, వేంకటరావుగారు ఆ రకం ప్లీడరు కారు.

కాకుండానే బాగా ఆర్జించేవా రాయన.

ఉండుండి, వెనకటి దావా బాపతు సొమ్ము పుచ్చుకుని, మా సోమప్ప కిరవయ్యీ నా కయిదూ రూపాయలు బహుమతీ చేసి, వెళ్లిపోయాడా కక్షిదారు.

ప్లీడరు గుమస్తాగా అదే నా మొదటి ఆర్జనా, చివరి అర్జనాను.

కాని, అది నా చేతిలో పడ్డం కొండ విరిగి మీద పడ్డట్టుంది నాకు.

“ఇలాగ నాలుగు డబ్బులు చేతిలో పడుతూ వుంటే కవితావ్యాసంగం చచ్చిపోదూ, వొక్క దెబ్బని?" అంటూ ఆ రాత్రి కలం పుచ్చుకున్నప్పుడు తల తిరిగి చెయ్యి వొణికిపోయింది నాకు.

ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు.

"చులాగ్గా అయిదు రూపాయలు కొట్టేశావ్" అన్నాడు మర్నాడు పొద్దున్న మా సోమప్ప.

పైకి నవ్వునటించి కుపిల్లిపోయాను, లోపల్లోపల నేను.

ఇక్కడ యిది యిలా వుండగా "పని మానేసి వెంటనే యింటికి రా” అని మా నాయనగారి కార్డు.

"వెళ్ళండీ” అన్నారు ప్లీడరుగారు, తమకున్నూ కార్డు వచ్చిందని చెబుతూ.

నాకేమీ అర్థం కాలేదు.

“పంచాంగం ప్రారంభించాలి కామోసు" అనుకున్నాను.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

179