మా సోమప్ప కూడా రాలేదింకా.
"చాలా పనుంది, నేను బజారుకీ వెళ్ళాలి. సరాసరీ కోర్టుకి వచ్చేస్తాను, భోజనం చేసి. నేటితో యీ నోటు కాలదోషం పట్టిపోతుంది, కనక యివాళ కోర్టులో పడిపోవాలి, వాడి యిల్లున్నూ టమటమా (ఈ మాట అన్నప్పు డాయన డప్పు వాయించడం అభినయించాడు) అయిపోవాలి. అయితే, బాకీదారు మన ప్లీడరుగారికి స్నేహితుడు. అయినా సరే, దావా పడిపోవలసిందే అని చెప్పండి" అంటూ కాగితాలు నా చేతికిచ్చి తొందరగా వెళ్ళిపోయా డాయన.
తరవాత వ్యవహారం నడిపించడం కష్టంగాని, ప్రోనోటు మీద ప్లెయింటు రాయడం బహుతేలిక.
ప్రోనోటు దావాల్లో ప్లెయింట్లకు నకళ్ళు రాసి వుండడం వల్ల నాకు బాగా పట్టుబడింది, ముందది.
“సదరు" వగైరాలు దండిగా చేర్చి నేనే రాసేశాను. వెంటనే ప్లెయింటు.
అది నోటుకి గుచ్చి, కూచున్న వెంటనే అదే ప్లీడరుగారి కళ్ళబడేటట్టున్నూ బల్లమీద పెట్టాను.
అది వారు చూసేదాక మా సోమప్పని ఆఫీసుకి రాకుండా చెయ్యమని పట్టిసం భద్రకాళీ అమ్మవారికి మొక్కుకుంటూనూ కూచున్నా నేమి యెరగనట్టు.
నే నాశించినట్టే అయింది.
ప్లీడరుగారే ముందు ఆఫీసులోకి వచ్చారు, హరి: ఓమ్మంటూ అదే మొదట చూశారు కూడా.
చూసి, ఏమిటిదీ అంటూ నిర్విణ్ణులయినా రాయన.
నేను, జరిగిందంతా చెప్పాను.
ఆయన మొగాన విచారం అలుముకుంది.
"ఇది కోర్టులో పడెయ్యకపోతే పెద్ద కాతా మరొకడికి పోతుంది” అనుకుంటూ ఆ కాగితాలు బల్లకీ వేసి కొట్టి, దిగాలుపడిపోయి కూచున్నా రాయన.
మా సోమప్ప వచ్చాడు.
అతనూ కక్షిదారూ బజారులో తారసపడ్డారుట.
నన్నతను కాగితాలడగ్గా ప్లీడరుగారిబల్ల చూపించా న్నేను.
"ప్లెయింటు రాసేవుంచాడు మీవాడు, రండి" అంటూ సోమప్పని పిలిచా రాయన.
ఇద్దరూ ఏకాంతంగా మాట్టాడుకున్నారు.
ప్లీడరుగారు మొగం కొంచెం వికసించింది.
భోజనానంతరం కోర్టుకి వెళ్ళాం.
"ప్లెయింటిదిగో, సిద్ధం. తప్పదంటే మీ యెదటే పడేస్తాను; కాని మనం తొందరపడ్డమే కనపడుతుంది, కసి తీరదు. ఏమంటే? బాకీదారు, మరోచోట సొమ్ము మాట్టాడుకుని మనం దావా పడేసిన ఉత్తరక్షణంలో కోర్టులో కట్టెయ్యడానికి సిద్ధంగా వున్నాడు. ఇంతకీ, - అతను మీ గుప్పిట్లో వుండడం మంచిదో, తప్పించుకుని
178
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1