Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రౌనుసైజు ఇష్టం లేదు కనక అది డెమ్మీ సైజులో వెలిసింది. అంత త్వరలో మరో గ్రంథం దొరక్క, యీ సైజులభేదం అసందర్భంగా వుంటుందని తెలిసీన్నీ సుందరరామయ్యగా రంగీకరించారు. విధిలేక."

ఇదీ ఆ కుండ.

నేను చాలా సిగ్గుపడ్డా నది విని.

కవులకు సంబంధించిన ఆ మాటా యీ మాటా వచ్చాయి, దీనిమీద.

"మీరు సావరం వెడుతున్న పని యేమట్టుకి వచ్చిందీ?" అనడిగారు రెడ్డిగారు, నన్నా సందర్భంలో.

జరిగిందంతా చెప్పా న్నేను.

“అసలు, సంగతి యేమిటి?" అనడిగారు, సుబ్బారాయడుగారు చకితులై.

నేను చెప్పాను.

విని విని "మీ కోరిక నాకు తెలిస్తే, గంటలో నే నదంతా చెప్పేసి వుండనా?" అన్నారు వారు.

అయితే, సుబ్బారాయడుగారికి ఛందస్సు తెలుసునని నాకేమి తెలుసూ?

“అదొక్కటే కాదు, వారి కింగ్లీషు తెలుసు. సంస్కృతం తెలుసు. తెనుగులో కవిత్వం చేస్తారు. కరిణీకం చెయ్యగలరు. దస్తావేజులు రాస్తారు. చాలాకాలం స్కూలు నడిపి చాలామంది కమ్మయువకులకు చదువున్నూ చెప్పారు -" అంటూ వారి శక్తులు యేకరువు పెట్టారు, రెడ్డిగారు.

ఆ విద్వత్తూ, ఆ నిరాడంబరత్వమూ చూసి విభ్రాంతుణ్ణయిపోయా న్నేను.

పిల్లవాణ్ణి చంకనపెట్టుకుని వూరంతా వెతికిన యిల్లాలి సామ్యం పట్టింది, నాకు.

కాని, అంతా మరుపు వచ్చింది, క్షణంలో.

జరిగిపోయిన దానికి పశ్చాత్తాపమూ, తెలియని దానికి సిగ్గూ, కాలం గడిచిపోతున్నందు కాందోళనా, కావలసినదాని కాత్రమూ విన్నవించుకుని సుబ్బారాయడుగారి యెదట దోసిలి వొగ్గా న్నేను, వెంటనే.

అంతే.

“సత్తిరెడ్డీ, సంగ్రహవ్యాకరణం తీసుకురా” అన్నారు. ఉత్తరక్షణంలో వారు.

రెడ్డిగారు తెచ్చియిచ్చారు, అవ్యవధానంగా.

అది తెరిచి, ఛందస్సున్న భాగంలో యతివిషయం చూపించి చదవమన్నారు సుబ్బారాయుడుగారు, నన్ను.

నేను చదివాను.

తెలిసింది చెప్పాను.

సందేహా లడిగాను.

వ్యాసఘట్టం అయిపోయి వుండినది విన్నవించాను.

ఒక్కటే మాట చెప్పారు, సుబ్బారాయడుగారు.

పీటముడి విడిపోయింది, ఆ మాటతో.

అ ఆ ఒ ఔ లకు యతి చెల్లుతుంది.

క ఖ గ ఘా లకున్నూ చెల్లుతుంది.

166

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1