Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయవరం వెళ్ళడం - పనివారు రాకపూర్వమే ప్రూపుల పని పూర్తిచేసుకోడం - వురుకులతోనూ పరుగులతోనూ సావరం చేరుకోడం - పెన్సిలు పుచ్చుకునీ అప్పకవీయం తెరుచుకునీ ఆత్రంగా కూచోడం; కాని, నాలుగు దినాలు తిరిగినా, యీ సంగతి యెన్నిమాట్లు జ్ఞాపకం చేసినా, యేమి టేమిటో కబుర్లు చెప్పాడు; గాని వొక్క అక్షరమైనా చెప్పలేదు, యతివిషయం నాకా వృద్ధుడు.

అసలు, ఛందస్సు సంగతే రానివ్వలేదా పెద్దమనిషి.

మొదటినాడు, గాఢనిద్రలో వుండగా, యెవరో వచ్చారంటూ కూతురు లేపింది.

రెండోనాడు, ఆయన స్వయంగా లేచేదాకా అరుగు మీద కూచున్నాను, క్షణాలు లెక్క పెట్టుకుంటూ నేను.

తక్కిన రెండు దినాలూ - ఆయన స్వయంగా లేచి, పెరట్లోకి వెళ్ళి పశువుల పాకలో కొంత కాలహరణం చేసి, విధి లేక అరుగుమీదికి వచ్చేదాకా పడిగాపులు పడివుండవలసి వచ్చింది; గాని యింత వోపిక పట్టినా, లోకాభిరామాయణంతో కాలం గడిపాడాయన.

తరవాత - అంటే నాలుగోనాడు, పదిమాట్లు పలకరిస్తే యేదో ఆలోచనలో వుండిపోయి వులిక్కిపడ్డట్టు నటిస్తూ మాట్టాడ్డం, ఆ మాట్టాడ్డం మాత్రం ఛందస్సుకి సంబంధించి వుండకుండా బాగా జాగ్రత్తపడి మరీ మాట్టాడం - ఇలా నడిపించా డాయన బండి.

చూసి చూసి "మీరు రమ్మన్నారే, యేమిటిది?" అనడిగాను న్నేను, నాలుగురోజులు గడిచిపోయాయన్న ఆవేదన కనపరుస్తూ.

దాని కాయన “అంత తొందరయితే యెలాగా? ఇది వొక శాస్త్రం. మాటలోనూ పూటలోనూ తెలిసేది కాదు" అని బదులు చెప్పాడు, నిశ్చలంగా.

"ప్రారంభించడాని కేమీ?” అనడిగాన్నేను.

"ఆ ధోరణి రావాలి చెప్పడానికి. తెలుసుకోడానికిన్నీ ఆ ధోరణి వుండాలి, మీరు తొందరపడుతున్నారు, అది మంచిది కాదు” అని బదులు చెప్పా డాయన.

"చెప్పుకునేవాళ్ళుంటే చెప్పడానికి నాకు మహా ఆనందం. అయితే, వోపిక వుండాలి, చెప్పుకునేవాళ్ళకి" అనిన్నీ అన్నా డాయన.

విసిగిపోయాను.

నిరాశ కూడా చేసుకున్నాను.

“నేను చెబుతాను ర”మ్మని పిలవడం ఆయన తప్పా, అది నిజమో డాబో తెలుసుకోకుండా ముక్కూ మొగమూ యెరగని మనిషి వెంటపడ్డం నా తప్పా?

ఏమయినా, తమకి తెలిసింది యెంతయినా, అందులో వొక్క అక్షరమయినా యితర్లకు చెప్పగూడదని వ్రతం పెట్టుకున్నవాళ్ళు లోకంలో చాలమందే వున్నారు.

తరవాత్తరవాత వొకరిద్దరు నాకు తటస్థపడ్డారు.

వారిలో మొదటివా డాయన.

అయితే, జిజ్ఞాసువుల క్కాదు నష్టం వారికే, తెలుసుకోగలిగితే.

164

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1