Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన వాలకం చాలా యెబ్బెట్టుగా కనబడింది, నాకా మొదటి చూపులోనే.

వస్తూనే, కొండేపూడి సుబ్బారాయడుగారి దగ్గరికి వెళ్ళి కూచున్నా రాయన.

కూచుంటూనే, అగ్గిపెట్టె తీసి, సుబ్బారాయడుగారినే అడిగి పుచ్చుకుని ఆయనతోపాటు చుట్ట అంటించారు కూడా.

నేను మరీ వింతపడ్డాను.

రెడ్లిద్దరు చుట్ట ముట్టకపోడమూ, వారితోనే నిత్యసహవాసం చేసే బ్రాహ్మలిద్దరు చుట్టకాల్చడమూనా మరి?

పైగా, ఇద్దరికీ వెలుగూ చీకట్ల కున్నంత వార; కాని యిద్దరూ చనువుగా వుండడం.

ఉండుండి, నాకేసి తిరిగారు, సత్యనారాయణగారు.

ఏ వూ రన్నారు, ఏమి టేమిటో అడిగారు.

కొన్ని వినిపించుకోలేదు నేను, కొన్నిటికి బదులు చెప్పలేదు, కొన్ని తిరస్కరించాను కూడా.

అయినా, ఆయన నన్ను విడిచిపెట్టలేదు.

దూరందూరంగా తొలిగిపోతూ వుండినా, యెవరి దారిని వారిని బతకనివ్వనివారి లాంటివారు లోకంలో చాలమందే వున్నారు.

"ఆయనకు చుట్టగిట్టదు, నువ్విలారా" అని సుబ్బారాయడుగా రెంతచెప్పినా కూడా నన్ను విడిచిపెట్టలే దాయన.

చూసిచూసి నేనే మరోచోటికి వెళ్ళవలసివచ్చింది.

పరిస్థితులిలా కలుషితా లయివుండిన సమయాన, కొమరిపాలెం నుంచి అయినాపురపు సుందరరామయ్యగారు వచ్చారు.

జయచంద్ర చంద్రరేఖా విజయం, గులేబకావలి మొదలైన నాటకాలకర్త ఆయన.

ఆయనకున్నూ ఆ ముద్రాశాలలో వొక వాటా వుంది.

సుందరి అని వొక మాసపత్రిక నడుపుతూ వుండినారు, వారప్పుడు.

అందులో, నెలకొక్క ఫారం చొప్పున కొన్ని పుస్తకాలు ప్రకటించేవారు.

దాని పనిమీదే వచ్చారు వారక్కడి కప్పుడు.

మా కిద్దరికీ పరిచయం చేశారు, రెడ్డిగారు వచ్చి.

అప్పటిదాకా మే ముభయులమే చూసుకోలేదు గాని, మా వుభయకుటుంబాలకూ చిరపరిచయమే.

ఆ సంగతే మేము మాట్లాడుకుంటూ వుండగా, అక్కడికిన్నీ వచ్చారు, సత్యనారాయణగారు.

సుందర రామయ్యగారున్నూ ఆయనను అసహ్యించుకున్నారు; కాని, సత్తిరెడ్డిగారు కలగచేసుకుని చెయ్యిపట్టుకుని లాక్కుపోయేదాకా మాత్రం కదల్లే దాయన.

నా నిమిత్తమున్నూ రెడ్డిగారెన్నో మాట్లు చేశారీపని, తరువాత్తరవాత.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

163