వెతుక్కుంటూ వెళ్లి ఆ గ్రంథకర్తతో స్నేహం చేసుకోవా లనిపించింది, నాకు ఆ క్షణాన.
కాని, అందులో నాకొక పెద్ద సందేహం.
“సంయుక్త పృధ్వీరాజూ పెళ్ళాడవచ్చా?" అని.
సంయుక్త తండ్రి జయచంద్రుడూ, పృధ్వీరాజూ అక్కాచెల్లెళ్ళ బిడ్డలు కావడం మూలంగా అన్నాతమ్ములు.
కాగా, సంయుక్త పృధ్వీరాజుకి కూతురు కాదూ, మరీ?
వారు భార్యాభర్తలు కావడమా?
నే నిది చెప్పగా, రెడ్డిగారు బదులు చెప్పలేకపోయారు.
అప్పుడే కాదు, వారే కాదు, ఇప్పటికీ నాకీ సందేహం తీర్చినవారు లేకపోయారు.
తరవాత్తరవాత, లక్ష్మణరావుగారితోనే, మరో రెండు విషయాలతోపాటు ఈ ప్రస్తావమున్నూ చేశా న్నేను.
“కొత్త ప్రశ్న యిది. ఎవరూ చేసి వుండని ఆక్షేపణ. ఆలోచించి గానీ, తేల్చడానికి వీలులేనిదిన్నీ" అన్నారాయన.
ఏవంచ, -
నేనూ రెడ్డిగారూ కూడా "యిది సందేహం అవునా, కాదా” అని కూడా చర్చించుకున్నాం.
ఇద్దరమూ అలాంటి అంతస్థులోనే వున్నామాయె మరి.
ఇంతలో పనివారందరూ వచ్చారు.
మాతృక నా చేతికిచ్చి, ప్రూఫులు దిద్ది, అవి పుచ్చుకుని కేసు దగ్గరికి వెళ్ళిపోయా రాయన.
ఇంతలో చెన్నుబొట్ల పెదసత్యనారాయణగారని వొకాయన అక్కడికి వచ్చారు.
రెడ్డిగారి జీవితంలో పరిణామదశ అంతా ఆక్రమించుకుని వుండినా రీయన.
దువ్వూరి రామిరెడ్డిగా రెంత పద్యకవో, మల్లిడి సత్తిరెడ్డిగారంత గద్యకవి కావలసినవారు.
ఈ పెదసత్యనారాయణగారి సాహచర్యం వారిని మరో దారికి లాగేసింది.
నాకున్నూ ఆయన సంపర్కం తప్పనిసరి అయిపోయింది, ఆ రోజుల్లో, రెడ్డిగారిని పట్టి.
పిట్టంతమనిషి; కాని తలతీసి, తలమార్చే రకం, ఆయన.
అప్పటి కావూళ్ళో ఆయన వొక్కడే కాస్తో కూస్తో పాస్‌పీస్ అనగలిగినవాడు.
అంచేత, ఇంగ్లీషులో జాబులూ జవాబులూ రాయడానికి పనికివస్తాడని చేరదీశారు రెడ్డిగారు మొదట్లో, కాని, చూస్తూ వుండిన్నీ రవ్వారట్టూ పడుతూ వుండిన్నీ విడిపించుకోలేకపోయాను, తరవాత్తరవాత.
కాకపోయినా, శుద్ధపల్లెటూరది.
రకరకాల మనుష్యులు దొరకరు.
ఉన్నవారికి సాహచర్యమూ తప్పదు, "దూరంగా వుండు” అపలేకపోతే.
162
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1