Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలా అంటూనే గాఢమైన పొడుం పట్టొకటి పట్టి, చరాచరా బయలుదేరి వెళ్ళిపోయా రాయన, కుందేల్లాగ.

ఆయనని సాగనంపివచ్చి, గతరాత్రి నేను పూర్తిచేసిన పుస్తకం విషయం యెత్తుకున్నారు, రెడ్డిగారు.

రాణీ సంయుక్త అన్న నవల అది.

శ్రీ వేలాల సుబ్బారావుగారు రచించగా, విజ్ఞానచంద్రికా గ్రంథమండలివారు ప్రకటించా రది.

విజ్ఞాన చంద్రికవారి పుస్తకాలకోసం అన్ని తరగతులవారూ అర్రులు చాచుకుని వుండేవారు, ఆ రోజుల్లో.

శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారి సృష్టి ఆ మండలి.

దేశం దౌర్భాగ్యంవల్ల ఆయన జీవితం అర్ధాయుష్యం అయిపోయింది.

విజ్ఞానచంద్రికా అంతరించింది.

ఆ మండలి ద్వారా లక్ష్మణరావుగారు ప్రకటించిన గ్రంథాలవంటివి ఇతర్లూ ప్రకటించగలరు.

ప్రకటించనూ ప్రకటించారు.

కాని, వాటికి లక్ష్మణరావుగారి ప్రకటనలకున్న ప్రామాణ్యం రాలేదు.

విలవా లేకపోయింది.

ఏమంటే?

తమ ప్రకటనలకు లక్ష్మణరావుగారు పీఠికలు రాసేవారు.

పీఠిక లంటే అవి.

ఆ గ్రంథాలు వేలూ లక్షలూ కేండిలుపవరు గల బల్బులు.

అయితే, ఆయన పీఠికలు వాటికి విద్యుత్ప్రవాహం.

అదీ ఆయన సంపాదకత్వం విశిష్టత.

తెనుగు యువకుల దృష్టి ఆకర్షించి వారికి కొంత చైతన్యం కలిగించినవారు లక్ష్మణరావుగారు.

ఒక కొత్త తరానికి పునాది వేశా రాయన; గాని మొదటి కీటు అయినా వెయ్యలేకపోయారు, ఆయుర్దాయం చాలక.

మరొకరున్నూ ఆ పని చేసినవారు లేరు, నేటికీ.

పోనీ అంటే, కొత్త పునాది వేసి, కొత్త గోడ తయారుచేసిన వారున్నూ లేకపోయారు, మనలో.

ఇదీ మన ప్రవృత్తి.

పోగా, నేను చదివిన మొదటి నవల ఆ రాణీ సంయుక్త.

గ్రంథం తెనుగే గానీ, ఆ పేరుమాత్రం తెనుగు కాదు, అప్పుడే తెలుసు నాకిది.

కాని, కథానిర్వహణం కొత్త వెలుగులు తోపించి, రచన నన్ను మిక్కిలీ ఉత్తేజపరిచింది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

161