"పద్యరచన సాధించి తీరా”లని దీక్షా పట్టించింది.
తాను నమ్మింది విడిచి, యితరుల మాటమీద మరోదాల్లో - అనిష్టమున్నూ అయినదాల్లో పడి మునిగిపోవడం శ్రేయస్కరం కాదు, నిజమే.
అయితే, యిది యిప్పటి మాట.
సహజంగా అప్పుడు బాల్యచాపలం.
పైగా, రహస్యంగా కవితాసాధన చెయ్యవలసిన దుర్గతి.
స్వయంగానున్నూ చేసుకోవలసిన అవస్థ.
కవిత్వానికి అనుకూలంగా వీధిలో యెవ రేమన్నా వేదవాక్యమే అయిపోయే సందర్భం.
దీంతో, నాకది వుద్రేకమే కలిగించింది.
రక్తం అంతా వుడుకెత్తిపోయింది.
వచ్చిన పని యెలా పూర్తిచేశానో చేశాను.
ఒక పుస్తకం చదివాను, సరిగా తలకెక్కలేదు.
"అప్పుడే పొద్దు గూకుతోందే” అనిపించేదల్లా "యింకా సాయంత్రం కాదేం?" అనిపించింది, ఆవేళ.
ఇంటికి బయలు దేరాను.
నడక కాదు, వురుకు.
అప్పుడే కాదు, ఆ రోజుల్లో, రెండు మూడేళ్లపాటు రాయవరం వెళ్ళడమూ ఇంటికి రావడమూ, నే నురుకులతోనే.
ఇంటికి తెచ్చిన పుస్తకం త్వరగా చదివెయ్యడానికీ, కొత్త పుస్తకం తెచ్చుకోడానికీ ఆ వురుకులు.
రాత్రి కవితా సాధన చేసుకోవాలి, అందుకూ వురుకు లగత్యమే.
“ఇప్పటికే కాలం చాలా దాటిపోయింది, ఇంకానా?” అన్న ఆత్రంవల్ల వచ్చేవి ఆ వురుకులు.
ఆ వురుకయినా, నిర్జన ప్రదేశంలోనా, మహేంద్రవాడ నడివీధిలో, మళ్ళీ.
పొలమూరినుంచి రాయవరం వెళ్ళాలంటే, మహేంద్రవాడ పక్కగా పంటకాలవగట్టే వెళ్ళవచ్చు, కళ్ళు మూసుకుని.
అయినా, మహేంద్రవాడ వూళ్ళోనుంచే వెళ్ళేవాణ్ణి, నేనప్పుడు.
మనసుతో ఆలోచన, కళ్ళతో చూపు, చెవులతో వినికిడి, బుద్ధితో సమన్వయం - కూచున్నా నడుస్తున్నా నిత్యకృత్యాలు, నాకివి.
నిత్యకృత్యాలే కాదు, అనుక్షణకృత్యాలు.
కవితా సాధనకు నిరుపహతిస్థలం కావాలంటే, లోకవృత్త పరిశీలనకో, మరి?
అదో మాటూ యిదో మాటూ అనడానికి, ఉప్పూ చింతపండూనా యివి, కావలసినప్పుడే కలుపుకోడానికి?
లోకవృత్తం చూస్తూ వుంటే, తక్కినవన్నీ మరుపువచ్చి, భావాలు పుడతాయి. కల్పనలూ తోస్తాయి నాకు, అందుకనుగుణంగా, లోకుల మాటలు వింటూ వుంటే,
158
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1