వేంకటరాజుగారిలాగ కాక, సాంబయ్యగారు పండితులు కూడా కావడంవల్ల వారి సమక్షాన మరి తెనుగును నిందించలేకపోయారు, అంతే.
నన్ను మాత్రం స్వేచ్ఛగా భాషాకృషీ కవితాసాధనా చేసుకోనివ్వదలచుకోలేదు వారు.
49
మధ్యకాలాన, కొన్ని సంవత్సరాలు గడిచాక, ఆ సంవత్సరమే మా పంచాంగం అచ్చువేయించడం ప్రారంభం అయింది, అనుకోనిది.
అంతకి పూర్వం అచ్చుపడుతూనే వుండిన్నీ, మా నాయనగారూ మా పెత్తండ్రిగారూ చెరో వూరిలోనూ స్థిరపడిపోవడంతో లంగరందక, ఆగిపోయి వుండింది అది.
అక్కడ మా పెత్తండ్రిగారూ. యిక్కడ మా నాయనగారూ కూడా, యెవరికి వారుగా శ్రద్ధ చెయ్యలేకపోయారు, ఆ విషయమై.
మా పెద్దన్నగారికిన్నీ ఆ సంకల్పం కలగలేదు.
మా చిన్నన్నగారే అనుకున్నారు హఠాత్తుగా, పట్టున్నూ పట్టారు, అచ్చువేయించి తీరాలని.
“మనకి సాగ"దని మా నాయనగా రెంతో నిరుత్సాహపరిచారు; కాని ఆయన వినిపించుకోలేదు.
మా నాయనగారి కా చూపే లేకపోయింది గానీ - అప్పుడు కాగితం ధర రీము రూపాయకు లోపు - అచ్చు ఖర్చున్నూ ఫారానికి రెండు రూపాయలకు పైని గదా, పది ఫారాల పంచాంగం అచ్చువేయించడం యేమంత భాగ్యం ?
ఏమయినా, మా చిన్నన్నగారు అప్పు డావిషయమై వుడుంపట్టు పట్టారు.
చివరి కిద్దరూ దొడ్డంపేట వెళ్ళారు, జమీందారు శ్రీ వాడ్రేవు రంగనాయకమ్మగారితో మనవి చేసుకోడానికి.
సహజంగా ఆమెకు విద్యలయెడల ఆదరం యెక్కువ, దానికి సాయం యిది సంస్థానానికి గౌరవాస్పదం.
కనక, సన్నిధానవర్తులే కొంత అభ్యంతరం చూపించారు గాని, ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించి, అచ్చుఖర్చుల నిమిత్తం డబ్బిచ్చారు.
వెయ్యి ప్రతులకు నలభై అయిదు రూపాయలు మాత్రమే అయింది, అప్పుడు అచ్చుఖర్చు, అమాంబాపతూ.
ఇంకో విశేషం యేమిటంటే?
రచనలో నేను పాలుపుచ్చుకున్న చివరి పంచాంగమూ అదే, మా పంచాంగం మళ్ళీ అచ్చుకావడానికి మొదలూ అదే.
అది కీలక సంవత్సర పంచాంగం.
రెండు మైళ్ళలో వున్న రాయవరంలో, శ్రీ భారతీ తిలక ముద్రాక్షరశాలలో అచ్చుపని ప్రారంభం అయింది.
146
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1