Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిత్యవ్యవహారాలతో సంపర్కం తెంపేసుకోలేదు.

అలౌకిమార్గాల్లో ప్రవేశించి లౌకికమూ వారూ మరచిపోలేదు.

నియోగులకు "లౌక్యు"లని మారుపేరు, అందరికీ తెలుసు.

తెనుగు దేశపు లౌకికాలకు తెనుగే గతి.

ఈ విధంగా నియోగులకు, తమ మాతృభాష నిత్యం త్రికాలాలయందూ ఆరాధ్యం అయింది.

వ్యవహర్త అయినవాడు, భావుకు డయితే, నిత్యవ్యవహారంలో వున్న భాషలో సాహిత్యవేత్త అవుతాడు.

తిక్కన్న మొదలైనవారే ఇందుకు నిదర్శనం.

నన్నయ భట్టారకుడు పునాది వేశాడు, మరిచిపోలేదు; గాని అప్పణ్ణుంచీ మొన్నటిదాకా నియోగులే ఆంధ్ర వాఙ్మయస్రష్ట లయి వన్నె కెక్కారు.

వైదికులకు వైదిక విద్యలతోనే సరిపోయింది.

అవి సంస్కృతంలో వున్నాయి కనక, వారికి సంస్కృతం కావలసివచ్చింది.

సంస్కృతం కావలసివచ్చింది కనక, వారది బాగా సాధించుకున్నారు.

సాహిత్యవేత్తృతకు తోడు భావుకత్వం వుంటే, దానికి సహజమైన పరిణామం కవిత్వం కనక, వైదికులు సంస్కృత కవులయినారు.

వారు వైదికులే అయి వుండవచ్చు, వైదిక విద్యలమీద పరమాదరభావం కలవారున్నూ అయివుండవచ్చు; గాని యజ్ఞయాగాదులు చేసినవారిలాగ పరమఛాందసులు మాత్రం అయివుండరు.

మరి, నన్నయ్య యజ్ఞం చెయ్యలేదా, తిక్కన్న యజ్ఞం చెయ్యలేదా అంటే, సహజంగా వారు భావుకులు కనక, కవిత్వమే వారికి జీవిత పరమావధి అయిపోయింది.

అంచేత, వారు ఛాందసు లయివుండరు, నేనిది గట్టిగా చెప్పగలను.

ఏమంటే?

ఎక్కడ వేదవేదాంగాల్లో యెక్కువ పాండిత్యం వుంటుందో, వాటి యెడల ఆదరభావం అయినా అతిమాత్రంగా వుంటుందో, అక్కడ కవిత్వమూ గానమూ వంటి లలితకళ లుండవు.

వాటిమీద శ్రద్ధా వుండదు.

అంచేతనే వెనకటి వైదికులు తెనుగంటే పెదవి విరవడాని కలవాటు పడ్డారు.

కవిత్వం కోసం వారికి తెనుగు చదువుకోవలసిన అగత్యం లేకపోయింది కనక, తెనుగులో వారికి జాతీయతే దూరం అయిపోయింది.

మా చిన్నన్నగారయినా, అప్పట్లో, తెనుగు కవిత్వం అంటే అంత వైముఖ్యం వహించడానికి, వారికి కవితామాధుర్యం తెలియనిదనా, సంస్కృత సాహిత్యంలో వారి ప్రావీణ్యం తక్కువదా, మరి?

ఏతావతా. -

వేంకటరాజుగారూ, సాంబయ్యగారూ యింత చెప్పినా మా నాయనగారికి దృష్టి మారలేదు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

145