Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"దీక్ష గదా, నేను స్నానం చెయ్యవచ్చా?”

"అవునవును, నిజమే. దీక్ష కనక మీరు స్నానం చెయ్యగూడదు. స్నానం చెయ్యడానికి వీలులేదు గనుక, అగ్నిహోత్రాలు చేసుకోడానికి మీకు అధికారం లేదు.”

చల్లచల్లగా మా తాతగారిలా అనేటప్పటికి తెల్లపోయాడు, కలెక్టరు.

"మరెలాగా ? "

"ఎలాగంటే ఏమి చెయ్యగలమూ?”

"పోనీ, విశేషవిధు లేమి లేవూ?”

"లేకేం?"

"ఏమిటవీ ?"

"ఎన్నో లేవు, వొక్కటే - అది హరిద్రాస్నానం.”

"అంటే?"

“హరిద్రాస్నానం అనేది సంస్కృతం మాట, దానికి తెనుగు పసుపుల నలుగులు.”

"సెబాస్" అనుకున్నా రందరూ.

“అయిందా?” అన్నట్టు కోరచూపులు చూశారు, స్త్రీలు.

మళ్ళీ మాట్లాడకుండా లేచి, బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్లి, నీరసంగా పెళ్ళికూతురి పక్కన కూచుని, పుచ్చినట్టు చెయ్యి అందించాడు కలెక్టరు, స్త్రీలకు.

దాంతో, అక్కడ వుండిన పెద్దలందరూ మా తాతగారి యెడల విధేయులయిపోయారు.

ఆ పెద్దలలో అధికారు లనేకులు.

ఆ అనేకుల్లో తహసీలుదా రొకడు.

ఆ తహసీలుదారే మా నాయనగారికి "మీ యిష్టం వచ్చినట్టు వాడుకోండది" అన్న అధికారి.

ఇలాగ గ్రామకరణం బాధ తప్పగా, ఆటేకుతుండు కోయించి అనేక గృహోపకరణాలు చేయించారు, మా నాయనగారు.

ఒక చెక్క మిగలగా, పనివాడే కోరి తయారుచేశాడా పెట్టె.

నేను కవిత్వం ప్రారంభించేటప్పటికి ఆ పెట్టె విడిచి, డస్కు బల్ల సంపాదించి దానిమీద రాసుకుంటున్నారు, మా నాయనగారు.

ఎప్పుడెప్పుడని చిన్నప్పణ్ణుంచి యెదురు చూస్తున్న నేను, వెంటనే ఆ పెట్టె పుచ్చుకున్నాను.

అదే ఆ సందుకా పెట్టె.

ఎలా మరిచిపోయారో మా నాయనగారు, మా చిన్నన్నగారి సలహాతో నా రచన మాన్పించడానికి రకరకాల నిర్బంధాలు కలిపించారుగాని, ఆ పెట్టెను వూళ్ళాక్కోలేకపోయారు.

అయినా, నేను రచన మాన ననుకోండి, విభాగాల సందర్భంలో కూడా ఆ పెట్టెకోసం యెవరూ తగువు పెట్టలేదు.


దాని వూసే యెత్తలేదు, ఎవరూ కూడా.

136

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1