Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఇద్దరినుంచి అద్దరికి వెళ్లాలి. మళ్ళీ అద్దరినుంచి యిద్దరికిన్నీ వచ్చేయ్యాలి. వెళ్ళాటప్పుడూ వచ్చేటప్పుడూ కూడా యెవరు ముం దుంటారో వారికి మూడు రూపాయలు బహుమానం. అది తక్కినవా ళ్ళందరూ యిచ్చుకోవాలి. ఇందు కిష్టపడేవా ళ్లెవరో లేవండోహోయ్" అంటూ లేచి, వూరి యువకు డొకడు నడుము బిగించాడు.

అందరూ వుద్రిక్తు లయినారు.

నాకూ పుట్టింది, కసి.

“సంయే” అంటే “సంయే" అనుకుని యెగిసిపడ్డాం.

ఉరికాం, బారలు వేశాం.

చేతికి యిసక తగిలేదాకా నాకు వొళ్లు తెలియలేదు.

వగర్చుకుంటూ నుంచుని వెనక్కి తిరిగి చూడగా, పందెం వేసిన యువకుడు నాలుగజాల్లో వున్నాడు.

ఇంకొక డంతకంటేనూ, మరొకడు వాడికంటేనూ వెనక వున్నారు.

ఉరకడం అందరమూ వురికాం; గాని తక్కినవాళ్లు, రేవులోనే నీటిలో కూచుని కొందరూ నుంచుని కొందరూ కనపడ్డారు.

మేము ముగ్గురమూ అవతలి వొడ్డు చేరుకోడం చూసి, చప్పట్లు మాత్రం కొట్టారు వాళ్ళు, ప్రేక్షకు ల్లాగ.

వచ్చినవాళ్ళం యిసకతిప్పమీద పడుకున్నాం, పావుగంటసేపు.

"సంయే” అంటే “సంయే" అనుకున్నాం, మళ్ళీ.

ఊగివూగి వురికాం.

నేను మళ్ళీ వొళ్ళు మరిచిపోయాను.

కొంతసేపటికి, రేవులో వుండినవా ళ్ళందరూ గుండెలలోతుకి వచ్చి నన్ను పట్టుకున్నారు.

వెనక్కి చూడగా, తక్కిన వారిలో వొకడు మెల్లిగా బారలు వేసుకుంటూ వస్తున్నాడు, వగర్చుకుంటూ.

వెల్లకితలా పడుకుని కెరటాల వూపుతో వొడ్డుకి తేలుకుంటూ వస్తున్నా డొకడు.

అందరమూ సాయంపట్టాం, వొడ్డుకతణ్ణి.

ఆ రాత్రి భోజనం చేసి బసకి వచ్చాటప్పటికే మూడు రూపాయలూ నా చేతికి వచ్చాయి గాని; చేసిన సాహసం తలుచుకుని నేను చాలా యిదయిపోయాను.

రాత్రి మూడో జామునగాని నాకు నిద్రపట్టలేదు.

ఇది తెలిస్తే గురువుగా రేమంటారో అని నాలు గయిదు రోజులు బెదురుగానే వున్నాను; గాని యెవరికీ తెలిసినట్టే లేకపోయింది.

ఈ సాహసాని క్కారణం వేట్లపాలెం చదువు.

గుమ్మంలోనే పడవల కాలవ, అక్కడ.

స్నానానికని వెళ్లి చామర్లకోట కాలవలో గంటల కొద్దీ యీతాలాడ్డం అక్కడ బాగా అలవా టయింది, నాకు.

130

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1