అవధానులవారిలో చాలామందికి కళ్ళు చెమ్మగిల్లాయి, గుండెలు పగిలి.
ఇప్పుడూ నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి, అప్పుడు నాకంఠం వొణికేపోయింది, దుఃఖంతో.
చూసిచూసి, అందరూ వెనక్కి మళ్ళా రవధానులు తలలు వంచుకుని; కాని "ఆగండి" అంటూ మా గురువుగారు ఉరిమారు, ముందు తాము ఆగిపోయి.
“ముందు జన్మలో పంతులుగారు దేవేంద్రవైభవం అనుభవించాలి, ఆశీర్వదించండయ్యా" అంటూ పనస కూడా అందుకున్నారు.
ఒక్కమాటుగా యెనభై శంఖా లురిమాయి.
వేదమంత్రస్మరణతోనూ ఉచ్ఛారణతోనూ ప్రాకృత వాతావరణం దాటిపోయారు, అవధానులు అందరూ.
అది కావడంతోనే "వౌధసం అందుకో శాస్త్రీ" అని ఆజ్ఞాపించారు మా గురువుగారు నన్ను.
నే నందుకున్నాను.
మళ్ళీ యెనభై వీణలు పలికాయి, నొక్కమాటుగా.
సామగానంతో అకాశం ముఖరితం అయింది.
అంతే.
అందరమూ బయలుదేరాము, తృప్త హృదయాలతో.
మే మందరమూ కనబడ్డంతసేపూ దోసిళ్లు వొగ్గి, అలాగే మోకరించే వుండిపోయారు, ఆ రాజర్షి దంపతులు.
42
ఒకనాడు - అయిదారు గడియల పొద్దువేళ - అగ్రహారం యువకు లేడెనమండుగురూ, విద్యార్థులం నలుగురైదుగురమూ యథాపూర్వకంగా గోదావరికి వెళ్ళాం.
కత్తిరివొడ్డు దిగగానే వొక పాయ.
రమారమీ ఫర్లాంగున్నర వెడల్పున వుం దది.
వేసవిలో కూడా యేనుగీత నీరుంటుంది, ఆ పాయలో.
గాలి రేగినప్పుడు, ఆ పాయలో, గజం యెత్తున యెగిరి విరిగి పడతాయి, కెరటాలు.
మేము వెళ్ళాటప్పటికి పైరగాలి తిరిగి వుండడంవల్ల తరంగ ఘూర్ణితం అయి వుండిం దది.
వెళ్ళినవాళ్ళం అందరమూ రేవులో నీటి దగ్గిరగా కూచున్నాం, వొక వారగా.
కెరటా లెగిరి కాళ్ళమీదా, తరంగ శీకరా లెగిరి వొంటిమీదా పడుతున్నాయి, యెడతెరిపి లేకుండా.
ఏ మాటమీద వచ్చిందో జ్ఞాపకం లేదు, అందరమూ ఆ పాయ దాటి అవతలికి వెళ్లా లనుకున్నాం.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
129