41
ఏలూరిలో గొప్ప దృశ్యం వొకటి కళ్ళబడింది, నాకు.
అది యిప్పటికీ జ్ఞాపకం వస్తూనూ వుంటుంది, కళ్ళు చెమ్మగిల్లి కంఠమున్నూ గద్గదికం అవుతూనూ వుంటుంది.
ఎంత ఆశ వుండినా పరాయతం నేను సాధించుకోలేకపోయాను, సిగ్గులచేటే యిది, అయినా, ఆపరాయతం చెప్పుకోడానికి పూనుకోడంవల్లనే నాకా దృశ్యం చూడ్డం జతపడింది.
ఏలూరిలో, వేదం నేర్చినవారిని భక్త్యావేశంతో ఆదరించే ఉదారహృదయు లొకరుండినా రప్పుడు.
ఏటా అవధానుల కందరికీ వొక్కొక్క రూపాయ చొప్పున ఇచ్చేవారుట ఆయన.
ఇల్లు తెలిసివుండినదే కనక, మా గురువుగారి నాయకత్వాన డెబ్బయి యెనభైమంది అవధానులు బయలుదేరారు, శిష్యులతోనూ, నిశ్చయబుద్ధితోనూ.
కాని, అప్పు డా యింటో యెవరో వుండినారు.
వారు "పంతులుగారు అదిగో ఆ దొడ్లో వున్నారని చెప్పారు, గుమ్మం యెక్కుతూ వుండగానే.
బిలబిల్లాడుతూ అవధాను లందరూ ఆ దొడ్లో ప్రవేశించారు.
విశాలమైనదే దొడ్డి, పాక మాత్రం చిన్నది వొకటుంది, అందులో.
కూలీనాలీ చేసుకునే బీదలు మాత్రమే నివసించే పాక వంటిది, ఆ పాక.
పాక బయట, కటికినేలమీద కూచునివున్నారు పంతులుగారు, ఔదార్యం మూర్తీభవించినట్టు.
చూసీచూడ్డంతోనే, వర్షించివర్షించి విశ్రమిస్తున్న మేఘంలాగా, మండిమండి నివురుగప్పిన నిప్పులాగా తోచారు మాకు, పంతులుగారు.
పంతులవారున్నూ, చాతకపక్షుల్లా వస్తున్న అవధానులవారిని చూసీచూడ్డంతోనే, కూచున్నవారు కూచున్నట్లుగానే సాష్టాంగపడి లేచి నుంచున్నారు, దోసిలి వొగ్గి.
వడిగా సమీపిస్తున్నవారల్లా అవధానులవారున్నూ మంత్రించినట్టు నిలిచిపోయారు నాలు గ్గజాల్లో, పంతులుగారి వాలకం గుర్తించి నిర్విణ్ణు లయి.
ఉండుండి, అప్పటికి కంఠం స్వాధీనమయింది కాబోలు, “ఏమే! వేదమూర్తులు దయచేశారు, వచ్చి సేవించుకో" అన్నారు పంతులుగారు, గ్రీవాభంగాభిరామంగా పాకలోకి చూస్తూ, గద్గదికతో.
వెంటనే, ముగ్గుబుట్టవంటి తలతో, మెడలో సూత్రం మాత్రమే వుండిన యిల్లాలు చక్కా వచ్చింది, వొక చీరమడత పట్టుకుని.
చాకలి వుతికిన బట్ట కాదది, స్పష్టంగా తెలుస్తూనే వుంది - ఆ యిల్లాలే వుతుక్కునీ, ఆరవేసుకునీ, మడతపెట్టుకునీ వుండినట్టు, ఆ చీర.
వెంటనే ఆ దంపతులు ఆ చీర విప్పి, పరిచి "దయచెయ్యండి దయచెయ్యండి” అని అవధానులవారిని ఆహ్వానిస్తూ, దోసిలి వొగ్గి పక్కపక్కగా మోకరించి నిలిచారు.
కొయ్య లయిపోయాం మేమందరమూ.
128
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1