పుచ్చుకోకపోతే దాతలదాకా అక్కర్లేదు, గురువులే కూకలేస్తారు - "బొడ్డున మాణిక్యం కట్టుకుని పుట్టుకు వచ్చావా, మహా?” అని.
తాడేపల్లిగూడెంలో మా గురువుగారు నన్నే అన్నమాట యిది.
ఆ ప్రయాణంలో నాకు పది పన్నెండు రూపాయలకు పైగా దొరికాయి; ఖర్చు మాత్రం అణానరో బేడో తగిలింది, కాలవలు తగిలినప్పుడు బల్లకట్టు దాటడానికి.
నాకు వేదపాఠం ప్రారంభంలోనే వుండినా, ప్రశ్నలు చెప్పడంలో గట్టివాణ్ణని చెప్పి యిప్పించేవారు నాకు, గురువుగారు.
పోతునూరిలో అవి జ్ఞాపకం, గురువుగారి మాటమీద వొకాయన నాచేత ప్రశ్న చెప్పించుకుని, గురువుగారికి మామూలుగా బేడమాత్రమే యిచ్చి, నాకొక రూపాయ ఇచ్చారు, ఆదరించి.
అవధానులవా రందరూ మొగమొగాలు చూసుకున్నా, రది చూసి.
ఒకాయన “గురువుగారి కిచ్చెయ్యి" అన్నారు. జంకుతూ నేనివ్వబోయాను; కాని “తప్పుతప్పు" అంటూ నన్ను నిషేధించి ఆయన్ని మందలించారు, గురువుగారు.
ఏలూరిలో అయిదారు రోజు లుండినాము.
రెండువందల దాకా వచ్చా రవధానులవారు.
ఆ అయిదారు రోజులూ వేదఘోషతో ముఖరితం అయిపోయింది, ఏలూరు.
దాత కనబడితే - అధవా యెంతో కొంత యివ్వగలవాడని తోచిన మనిషి తటస్థపడితే, వేదమంత్రా లందుకుంటారు. అవధానులవారు, మరి మాటా మంతీ లేకుండా.
కొందరు చేత్తో లేదంటారు, కొందరు నోటితోనే లేదంటారు, ప్రయాణాని కంతటికీ వొక రిద్దరయినా యీసడించేవారూ తగులుతారు.
దాతల్లో నయినా, వొకరో యిద్దరో వస్తే, యెంతో కొంత యివ్వగలవారూ, యిచ్చేవారున్నూ వుంటారు; గాని వేదం వల్లించినవారు గుంపులు గుంపులుగా వెడతారేగాని యెవరికి వారుగా వెళ్ళరు.
యిది యిచ్చేవారికీ కొందరి కిబ్బంది కలిగిస్తుంది. భోజనాల విషయంలో అవధానులవారి కీ చిక్కులే కలిగిస్తుంది, అయినా వా రా పద్ధతి మానరు.
మరో వైదికవిద్య నేర్చినవా రెవరూ అలా చెయ్యరు.
అణా బేడా చొప్పున ఆర్జన యేమిటనీ బాధపడరు అవధానులు; ఆమాత్రం అయినా యిచ్చేవా రుండినంతకాలమూ పదేళ్ళపాటు నిద్రాహారాలు మానుకుని వేదం వల్లిస్తారు గాని.
వేదం అంటే చెయ్యెత్తి మొక్కుతారే గాని, ప్రజలయినా వేదం వల్లించినవారిని ఘనంగా సత్కరించరు.
వేదం వల్లించినవారినే కాదు, మనవాళ్లు, ఏ విద్యలు నేర్చినవాళ్ళనైనా అంతే, నలుగురితోనూ పాటు హాయిగా బతకాలనుకుంటే ఆ విద్యలు నేర్పినవారు మరో వృత్తి యేదయినా అవలంబించాలి, తప్పనిసరిగా.
మహా కవుల క్కూడా హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ మగ్గిపోతే తప్ప మరి గతి లేదు గదా? మనవారి విద్యాతృష్ణకూ, విద్యాగౌరవానికీ, విద్యాపోషణకూ మరేమి నిదర్శనం చూపించాలి?
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
127