Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంత మానుకోవలసివచ్చిం దంతే. పక్క చేలో వున్న మర్రిచెట్టెక్కి, వారం రోజులకు సరిపోయే ఆకులు కోశాను, క్షణంలో.

పెరట్లో బాదం చెట్టుంది, మర్రి ఆకులు వారి కక్కరలేదు అలవాటూ లేదు, అయినా, విద్యార్థికి పని చెప్పకుండా వుండలేరు గురువులు, గురుకులవాసంలో.

కొడుకులకున్నూ అలా పనులు చెబుతారు, వారు.

మధ్యతరగతి యువకులకు ఆ పద్ధతి శ్రేయస్కరమే - సందేహమూ లేదు, ఆక్షేపణా లేదు.

పనీ చెబుతారు, ఎలాగయినా వీడికి నాలుగు ముక్క లంటాలన్న ఆవేదనతో చదువూ చెబుతారు, ప్రీతిగా వారు.

విద్యార్థి అంటే వారి దృష్టిలో, కుటుంబంలో వొకడు - పుత్రతుల్యుడు, పైవాడు కాడు.

ఆ కుటుంబంలో వున్న పిల్లలున్నూ విద్యార్థులను అన్నలుగానూ తమ్ములుగానూ చూసుకుంటారు.

తమ యింటో యేమి పిండివంట చేసుకుంటే అది, తన పిల్లలతో సమంగా పెడుతుంది గురుపత్ని, విద్యార్థికి.

అక్కడ వుభయవర్గాలకూ గూడా స్వస్వరూపంతో సాక్షాత్కరిస్తుంది, ఆత్మీయత.

అంచేత, గురుకులవాసం వుసూరు మనిపించదు, వుత్సాహకరంగానే వుంటుంది.

కాని, ఆ రాత్రి భోజనం చేశాటప్పుడు కుడిచెయ్యి మండిపోయింది, నాకు.

బసకి వచ్చి పడుకున్నాక “మరి రేపు గడ్డిమాట యేమిటి?" అని బెంగ కూడా పట్టుకుంది.

అయితే, వొక్కొక్కప్పుడు, అందుకు, యేదో వొక సౌకర్యం తటస్థపడుతుంది, అనుకోనిది.

ఆ వూళ్ళో, వూరికొక చివర కమ్మరికొలిమి.

పనివాడు సరదా అయినవాడు.

లోకజ్ఞానం వున్నవాడున్ను.

మా నాయనగారంటే అతని కతిభక్తి.

ఆ వూళ్ళోనూ, పక్కనే వున్న పుసునుమర్రు గ్రామంలోనూ మా పెద్దక్క గారికి యీనాం భూములున్నాయి.

మా బావగారు చనిపోయి వుండడంవల్లా, మా మేనల్లుడు పసివాడు కావడంవల్లా ఆ భూముల అమరకం వగైరాలు మా నాయనగారే చూసేవారు.

ఆ పనిమీద అక్కడ వుండినంతకాలమూ జాతకాలు చెప్పించుకుంటూనూ, ప్రశ్నలు చెప్పించుకుంటూనూ అతను మా నాయనగారిని కనిపెట్టుకునే వుండేవాడు.

ఇదంతా తెలియజేసి "అతను పనసకాయ కత్తి చేసి యిస్తా నన్నాడు, వచ్చేటప్పుడు పట్టుకురా” అని చెప్పి పంపారు మా నాయనగారు, నన్ను.

ఆ బెంగలో నాకిది జ్ఞాపకం వచ్చింది.

కాల్యాలు తీర్చుకుని, అతను కొలిమిదగ్గిర కూచునేటప్పటికి వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకున్నాను, మర్నాటి పొద్దున్న నే నతణ్ణి.

124

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1