క్రమంగా క్షీణించగా క్షీణించగా అప్పటికి నిలిచివుండిన సంఖ్యలివి.
ఆదిలో ఆ వూళ్ళో రెండు వందల గడప దాకా వుండేదిట బ్రాహ్మణ్యం.
ఎనభైరెండు పన్నాలూ కత్తులమీద పరీక్ష యిచ్చేవారు యాభైమంది దాకా వుండేవారుట.
వేదం తప్ప అవూళ్లో మరో శాస్త్రమూ లేదు, కళా లేదు.
వైద్యుడున్నూ లేడు, చివరికి.
సాధారణంగా వేదవిద్య ఎక్కువగా వుండేవూళ్ళ పద్ధతే అలా వుంటుంది.
పెద్దావధానులుగారు అని వేదార్థం చెప్పేవారొక రుండేవారక్కడ, ఆయన పోయిన కొద్ది సంవత్సరాలకే నేనక్కడికి వెళ్ళాను.
అవూరంతా మెట్టపంట.
పాటకజనం తప్ప, రెడ్లు, కమ్మవారు, తెలగాలు - ఇలాంటి రైతాంగం లేదు, ఆ వూళ్లో.
అంచేత, చదివినవారూ చదవనివారూ బ్రాహ్మలంతా వ్యవసాయదారులే అక్కడ.
పొరుగూళ్ళవారి కక్కడ భూములుంటే, అవిన్నీ వారే కవుళ్ళకు పుచ్చుకోడం.
ఆ వూరి మున్సబున్నూ వెలనాటివారే.
అక్కడ లక్షాధికారులూ వున్నారు, భిక్షాధికారులూ వున్నారు.
వేదం పూర్తి అయినవారూ వున్నారు, పునహాసతారాలు తిరిగే అంశువారీలూ వున్నారు.
వడ్డీవ్యాపారం చేసేవారూ వున్నారు, రుణాలలో మునిగిపోయినవారూ వున్నారు.
ఇంగ్లీషులో దిగి మారినవారూ వున్నారు, ఎందులోనూ దిగకుండానే మారినవారూ వున్నారు.
“బ్రాహ్మణోత్తములు” అనిపించుకోతగ్గ సంప్రదాయాలూ వున్నాయి; "ఛా, యిదేం పని?" అనిపించుకునే దురాచారాలూ వున్నా యక్కడ.
అగ్రహారం అంటే విశిష్టంగా వుంటుందనుకుంటూ వెళ్ళాను, వేదం చెప్పుకున్నవారెక్కువమంది వుండడమూ, బ్రాహ్మణగడప యెక్కువ వుండడమూ తప్పిస్తే మరే విశేషమూ లేదక్కడ.
నేను కలలో కూడా అనుకోని దురాచారం వొకటుంది ఆ వూళ్లో.
సాధారణంగా పొలమూరు ప్రాంతాన, విఘ్నేశ్వరుని చవుతినాడు, పిల్లకాయలు రాత్రివేళ యిళ్ళమీద రాళ్లు రువ్వుతారు.
ఉండ్రాళ్లు రువ్వడం అసలు సంప్రదాయం.
ఉండ్రాళ్లు పోయి, వెలక్కాయలూ, మారేడు కాయలూ, యిటుకముక్కలూ రువ్వడం మామూలయిపోయింది చివరికి.
ఈ పని బ్రాహ్మణపిల్లకాయలు చెయ్యరు.
కానూరు అగ్రహారంలో బ్రాహ్మణయువకులే చేస్తారు ఇలాంటి పని, ఆవేళ.
యాభై అరవైమంది కుర్రవాళ్లు, రాళ్ళు పుచ్చుకుని వెళ్ళి తేలీల యింటి యెదుట కూచుంటారు, మధ్యాహ్నం, పొద్దువాలాక.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
119