ఇంతేకాదు.
తలలో యేమిటేమిటో మెరుపులూ, హృదయాన ఎందుకెందుకో ఆవేగమూ, అదంతా కాగితంమీది కెక్కించి వెయ్యాలని మనస్సు వురకలూ ఇదీ - నా ప్రపంచం.
సాంసారికంగా మరొకళ్ళయితే కుంగిపోయి వుందురు; కాని చీమ కుట్టినట్టున్నూ లేదు నాకు.
ఈ స్థితిలో - ఆ సంవత్సరం పూర్తి కావస్తోందనగా మా సీత కాపరానికి వచ్చింది.
"మన చిన్నబ్బాయి కూడా వొక యింటివాడయినాడని మా అమ్మగారితో చెప్పి యెంతో సంతోషించారు, మా నాయనగారు.
“మన బాధ్యత తీరిపోయింది" అనిన్నీ అనుకున్నారు.
అనుకున్నారే గాని తీరలేదు, లేశమూ.
పైపెచ్చు, నా భారమున్నూ వారిమీదే పడింది.
పడింది అంటే, గుర్తు తెలిసి నేను వెయ్యలేదు, వారే వేసుకున్నారు, కోరి.
అది కూడా నేను గమనించలేదు.
ఆ దృష్టే లేదు నాకు.
అప్పటిదాకా యెలా ప్రవర్తించానో, అప్పణ్ణుంచీ అలాగే ప్రవర్తించసాగాను, నిశ్చింతగా.
37
అప్పటికే కాదు, ఇప్పటికీ నా ప్రవృత్తి యిదే.
వయసు పెరిగిందే కాని, చూపు మారలేదు.
"భాష పరసీమలు చూడాలి, గజం యెత్తు పుస్తకాలు రచించాలి" ఇదీ ఆ చూపు.
“వైదిక సంప్రదాయం విడిచిపెట్టినందుకు, కుటుంబంలో కవిత్వసంప్రదాయం ప్రారంభించాలన్న కొత్తరేఖ కూడా కలిసింది, ఆ చూపులో.
దాంతో, నా ప్రవృత్తి స్థిరపడిపోయింది.
ఇక, -
అది వొక ఉత్సాహాం.
అది వొక ఉల్లాసం.
అది వొక ఉద్రేకం.
అది వొక ఆవేగం -
ఇవి నడిపించుకు పోతున్నాయి, నన్నప్పణ్ణుంచీ.
నా పురాకృతసుకృతం దీనిక్కారణం.
నా జీవితం చీలికల్లేని యీ గాడిలో పడినందుకు మిక్కిలీ గర్వపడుతున్నా న్నేను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
115