Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవహారం స్తంభించిపోయింది.

మరి, వెంకటరమణయ్యగా రేమి చేస్తారూ?

ఇలాంటప్పుడే తెలుస్తుంది, మనిషి యోగ్యత.

ధర్మపరులన్నాను నే నాయన.

నిజంగా ధర్మపరులే అయినారు, ఆ సందర్భంలో, వారు.

మా పెద్దన్నగారిని వొప్పించారు, చివరికి.

బతికి వుండినంత కాలమూ మా అమ్మగారూ మా నాయనగారూ ఆ భూమి అనుభవించేటట్లూ, వారి వుభయుల అనంతరమూ మాకు ముగ్గురికీ అది సమభాగాలుగా స్వాధీనపడేటట్టూ, దిగ్విభాగం కూడా చేసి పథకం యేర్పాటు చేశారు మా చిన్నన్నగారు.

మంచీ చెడ్డా వుంటుంది కనక, యేభూమి కాభూమే మూడేసి ముక్కలూ చేసెయ్యవలసిందే అని మా పెద్దన్నగారు.

భూములు మరీ స్వల్పఖండాలయిపోతాయి కనక, కీడు మేళ్ళవరసన భూములు లాట్లుగానే పంచాలని మా చిన్నన్నగారు.

ఇదీ ప్రతిష్టంభనం తెచ్చింది.

కాని, మా చిన్నన్నగారి పద్ధతే స్థిరపడింది, చివరికి.

మిగిలివుండిన చిల్లర రుణాలూ, పాత్రసామానూ, మా ముఖ్యాస్తి రెండుబళ్ళ పుస్తకాలూ మాత్రమే మూడు వాటా లయినాయి, సమంగా.

పారీఖత్తు రిజిష్టరయిపోయింది.

అస్వాధీనం భూమి వొక్కొక్కళ్ళకు రెండేసిపుట్లు వచ్చింది, వేరువేరు గ్రామాల్లో.

నిజమే, కాని యేమి లాభమూ?

రెక్కలే ఆధారం.

మా పెద్దన్నగారు చాలా సంతోషించారు.

మా చిన్నన్నగా రయినా నిరుత్సాహపడలేదు. ఏదో విధంగా, సంసారం గెంటుకుపోయే శక్తి ధైర్యమూ వున్నాయి, వారికి.

నా పనే అస్తవ్యస్తం అయిపోయింది.

నివేశనమూ తాటాకుల యిల్లూ తప్ప సెంటుభూమి స్వాధీనంలో లేదు.

వ్యవహారజ్ఞాన మయినా లేదు.

ఆర్జనశక్తి బొత్తిగా లేదు.

బువ్వ యెలా వస్తోందో తెలియనే తెలియదు.

పదిహేడో సంవత్సరం నడుస్తోంది, నా కప్పుడు.

ఇదీ అప్పటి నా స్వస్వరూపం.

ఆ వయసువాళ్ళలో నావంటివాళ్ళు మరికొందరున్నూ వుంటారు, అదో విశేషం కాదు.

మరేమిటంటే?

ఆకలయితేనే భోజనం చెయ్యాలన్న దృష్టీ, నిద్ర ముంచుకు వస్తేనే పడుకోవాలన్న జ్ఞానమూను, నా కప్పుడు.

114

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1