Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

ఒకరి ననకుండా, వొకరిచేత అనిపించుకోకుండా సంచరించే స్వభావం మా నాయనగారిది.

అంచేత, సంసారం గుట్టు వీధిలో పడిపోకుండా వుండడానికి, వెంటనే మా పెద్దన్నగారి ప్రయత్నాల కంగీకరించారు, వారు.

మా పెద్దక్క గారి సలహా కూడా యిందుకు బాగా ప్రోద్బలపరిచింది వారిని.

తన కొడుకూ తన సంసారమూ వేరే వుండినా, యిక్కడ కూడా కొంత పెత్తనం సాగించే దావిడ.

పెత్తనం చేసినా అందర్నీ సమానంగా చూస్తే యిబ్బంది లేకపోవును.

మొదణ్ణుంచీ, మా చిన్న అన్నగారిమీద ప్రత్యేకాభిమానం ఆవిడకు.

నామీద అలాంటిది లేకపోగా, మా పెద్దన్నగారిమీద మాత్రం వల్లమాలిన ద్వేషం.

ఇది మా వదినగార్ల తగువులకు కొంత కారణమూ, కొంత ప్రోద్భలమూ కూడా అయింది.

మా పెద్దన్నగారికి విడిపోవాలన్న బుద్ధి పుట్టడానికిన్నీ యిదే కారణం.

క్షణం అయినా ఆలస్యం చెయ్యలేదు, మా నాయనగారు.

మహేంద్రవాడలో, ఏడిద వెంకటరమణయ్యగారని వొక సంపన్న నియోగి గృహస్థు.

ధర్మప్రవర్తకు లాయన.

మంచి వ్యవహర్తలు.

మా కుటుంబం అంటే, యెంతో ఆదరమూ గౌరవమూను ఆయనకు.

ఆయన మధ్యవర్తిగా మూడు వాటాలు వేసేశారు మా నాయనగారు, వున్నదంతా.

తమకు వాటా పెట్టుకోలేదు.

పోనీ అంటే మిగుల్చుకోడాని కెప్పుడూ లేదు, ఏమిన్నీ.

మేము ముగ్గురమూ, ఏటా ఇంతింత అని కొంత సొమ్ము తమకిస్తూ వుంటే చాలు నని వారి నిశ్చయం.

మా పెద్దన్నగారు డబ్బివ్వడాని కంగీకరించారు; కాని మా చిన్నన్నగారు “వల్లకా”దని ప్రతిఘటించారు, గట్టిగా.


అంత ప్రయోజకులకు కొడుకులు భరణం యివ్వడమా అని వారి కభిమానం వచ్చింది.

నా కది నచ్చింది, ఆ అజ్ఞానదశలో కూడా.

దొడ్డంపేటలో, వాడ్రేవు జమీందారు లిచ్చివుండిన పుట్టెడు భూమిలోనూ మా నాయనగారి వాటా నాలుగు యకరాలు.

తక్కిన భూములన్నీ తనఖాలో వుండగా, అదొక్కటే అప్పటికి స్వాధీనంలో వుండినది.

దానిమీద నలభై బస్తాలదాకా ధాన్యం వస్తోంది యేటా.

అది మా నాయనగారి కిచ్చెయ్యాలని మా చిన్నన్నగారి వాదం.

ఇది మా పెద్దన్నగా రంగీకరించలేదు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

113