మా పెత్తండ్రులిద్దరు నడివయసులోనే నిస్సంతుగా చనిపోయారు.
మూడోవారు చలమయ్యశాస్త్రులుగారూ, నాలుగోవారు మా నాయనగారున్నూ మాత్రమే దీర్ఘాయుష్మంతులు.
వా రిద్దరూ విభాగాలు చేసుకోడంలో, అంత నిర్లిప్తులున్నూ మా తాతగారు మా పెత్తండ్రిగారి వైపు మొగ్గారు.
దానిక్కారణం మా పెత్తండ్రిగారి పరిస్థితులు.
ఆయనా కులవిద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నవారే; గాని, వొక్కటీ కంఠస్థం కాదు, వొక్కదాన్లోనూ స్వాతంత్య్రం యేర్పడలేదు.
మాట్టాడితే పుస్తకాపేక్ష వారికి.
మా నాయనగా రేది నేర్చినా యితిశ్రీగా నేర్చేవారు.
వారు సాధించిన విద్యలన్నీ, బతికి వుండినంతకాలమూ వారికి జిహ్వాగ్రాన వుండేవి, మాకు బాగా తెలుసు.
నేర్చిన ప్రతీవిద్యలోనూ స్వాతంత్ర్యం వుండేది, మా నాయనగారికి.
సభకి వెడితే మా పెత్తండ్రిగారు దిక్కులు చూడ్డమూ, సింహప్పిల్లలాగ మా నాయనగారు వీరవిహారం చెయ్యడమూ పరిపాటి.
“సంగ్రహీ నావసీదతి” అన్న తత్వం మా నాయనగారిది.
అసలు, విద్యలు నేర్చుకోడమూ, నేర్చిన విద్యల్లో స్వాతంత్ర్యం సిద్ధించడమూ - ఇది మనచేతిలోనే వుందా?
కొంద రెంత చదివినా విద్య అంటదు.
ఎంత వల్లించినా జ్ఞాపకం వుండదు.
కొందరికి, సుళువుగా కంఠస్థం అయిపోతుంది, మరిపోదు.
పూర్తిగా బోధ అయి వారికి విశిష్టతా కలిగిస్తుం దది.
ప్రతిభావంతుల్లోనే యీ భేదం కనపడుతుంది, మళ్ళీ.
సభకు వెడితే కొంద రద్భుతంగా మాట్టాడతారు, ఇంట్లో కూచునిన్నీ చక్కగా రాయలేరు.
చాలా గొప్పగా రాస్తారు కొందరు; విషయం యెంత తెలిసివుండినా, మనస్సుకి రంజకంగా మాట్టాడలేరు, సభల్లో.
ఇది ప్రయత్నలోపం కాదు, మరేమిటో?
ఏమిటో వ్యక్తం కాని యీ భేదమే వుండేది విద్యల్లో, మా పెత్తండ్రిగారికీ, మా నాయనగారికిన్నీ.
సాంసారికంగా కూడా, మా పెత్తండ్రిగారి యింట ప్రతీ వస్తువుకోసమూ యెప్పటి కప్పుడు బజారుకి బయలుదేరడమే.
మా నాయనగారి కది కిట్టేదికాదు.
రోజు గడవడం కాదు మరి, ప్రజ్ఞ, కాలం గడవాలి.
పురుషుడు కొన్ని రోజులు పొరుగూళ్ళలో వుండినా, యింటో స్త్రీ వొడిదుడుకులు పడగూడదు.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
111