ఆయన వీలునిబట్టి నేను మాత్రం ఆయనతో కలిసి కూచుని పంచాంగం చెయ్యాలి.
తమకు మా నాయనగారి అండ వుండబట్టిగాని, నాకూ వొక విశిష్టధర్మం నిర్వర్తించుకోవలసిన అగత్యం వుండినప్పుడు, తమ వీలునుబట్టే నన్ను నడుచుకోమనడాని కాయన కేమి అధికారం వుంది?
మా పెద్దన్నగారికీ మా చిన్నన్నగారికీ వుండుకున్న వ్యత్యాసం యిదీ.
ఇప్పటి నా పరిస్థితులను పరిశీలించిచూస్తే, ఆయనకు సంక్రమించిన యీ నియామక సత్తావల్ల, అప్పుడు నేనెంత నష్టపడ్డానో యెవరి కయినా బోధపడుతుంది.
అయితే, నియామకులు నిర్బంధం అవలంబిస్తే, నియుక్తులు, కొన్నిచోట్ల అయినా ప్రతిఘటనకు పూనుకోకపోరు.
జపం విషయమై మా చిన్నన్నగారికి గల అవ్యవస్థను పట్టి, నా కవితావ్యాసంగం నిర్బాధంగా సాగడానికి నేనూ వుపాయాలు చూసుకోసాగాను.
చీకటితోనే కాల్యాలు తీర్చుకుని, చద్దన్నమున్నూ తినేసి “మరి, పంచాంగం చేద్దాం వస్తావా, స్నానం చేసి జపం చేసుకుంటావా?" అని ఆయన్ని నిక్కచ్చిగా అడగడం ఆ వుపాయాల్లోదే, వొకటి.
దీనిమీద ఆయన కూడా వుపాయాలు వెతికారు.
నా తన్మయత్వం చెడితే చాలు, ఆయనకు.
అప్పు డప్పుడు మాత్రమే ఆయన అంచనా తప్పిపోయేది, తరుచు నేనే దెబ్బతినేవాణ్ణి.
ఇతరులకంటే అప్పటి నా బాధ రచయిత అయినవారే గ్రహించ గలరు, బాగా.
ఏమంటే?
బుద్ధి రచనావ్యగ్రం అయిందా, యిక, ఆ రచయితకు నిద్ర అక్కరలేదు, ఆహారం అక్కరలేదు, డబ్బక్కరలేదు, కోరి అప్సరస వచ్చినా అక్కరలేదు.
ఆ స్థితి యెప్పుడు వస్తుందో రచయిత కూడా తెలుసుకోలేడు, వచ్చినప్పుడందులో తలమునకలు కావడమేగాని.
ఉద్దీపనం రకరకాలుగా వుంటుంది, అనేక సందర్భాలలో కలుగు తుంది, అది అలౌకికం.
నిరంతరసాధన వల్ల, కావలసినప్పు డది సిద్ధించే సత్తా సంపాదించుకోవచ్చు; గాని అది దృశ్యాదృశ్యం.
అంచేత, ఒక్కొక్కప్పుడు నాకు కలిగిన రచనోద్వేగం, మా చిన్నన్నగారి ఉపాయాలవల్ల యెగిరిచక్కాపోయేది.
ఆయన చూడనప్పుడు నాకది కలిగితే కలిగేది, లేకపోతే వుసూరుమంటూ వుండిపోయేవాణ్ణి.
పోనీ అంటే, అలాంటప్పుడు చదువు మాత్రం యేమి సాగుతుంది?
ఏమంటే?
రచయిత చదువు వేరూ, విద్యార్థి చదువు వేరున్ను.
అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1
107