అనుకోని యీ పుట్టిమునక మా నాయనగారికి శాంతిభంగకరం అయిపోయింది.
వారు సద్దుబాటు చెయ్యడానికే చూశారు; గాని అసాధ్యం అయిపోయిం దది.
తగువు లంటే దూరంగా వుండే మా పెద్దన్నగారు, ఇది సహించలేక, పొలమూరు విడిచి, మహేంద్ర వాడలో మా నాయనగారు సంపాదించి వుండిన నివేశనస్థలంలో యిల్లు కట్టుకుని పృథగ్భాండాశనం ప్రారంభించారు.
దీంతో, నా స్థితి అసలే చెడింది.
నేను తెనుగు గ్రంథాలు చదవడంలోనూ, తెనుగులో రచన చెయ్యడంలోనూ ఏర్పడిన నిషేధం, పేరుకే మా నాయనగారిది.
అదయినా వాగ్రూపం మాత్రమే.
ఈ విషయం వచ్చినప్పు డల్లా వారు నన్ను తిట్టేవారు.
మండిపడి మండిపడి, తమ అసహాయతనూ నిందించుకునేవారు.
వారి మాటమీద, అది, ఆచరణలో - పూర్తిగా పెట్టినవారు మా చిన్నన్నగారు.
నికరమైన సంస్కృత సాహిత్యం మా చిన్నన్నగారిది.
సహజంగా, ఆయనకు, మా కులవిద్య లన్నా, సనాతన ధర్మం అన్నా, నియమనిష్ఠ లన్నా ఆదరం యెక్కువ.
దీనికి సాయం, అప్పటికప్పుడే, మా యింటో వుండిన ముద్రితాముద్రితాలు ఇరవై ముఫై ధర్మశాస్త్ర గ్రంథాలూ పరిశీలనగా చదివి వుండినా రాయన.
ఆ చదువు, వారిని, ఛాందసంలో దింపేసింది, ముఖ్యంగా.
యజ్ఞయాగాదులు చేసినవారికిన్నీ లేని ఆచార వ్యవహారాల పట్టింపు వచ్చేసిందాయనకు.
మా పెద్దన్నగారికి వైదికాచారాల విషయమై వీరవ్రతం లేదు, కొంచెమున్ను.
నేను మరింత ముందుకే వెళ్ళిపోయాను.
అంటే, వీలయినప్పుడల్లా సంధ్యావందనమున్నూ మానేస్తున్నా నప్పటికే.
ఈ కారణాలు, మా పెద్దన్నగారి మీదా, నామీదా ద్వేషమూ మా చిన్నన్న గారిమీద ప్రీతీ పుట్టించాయి, మా నాయనగారికి.
“తప్ప పుట్టారు” అని మామీద నిరసన భావమూ "కుల దీపకుడు" అని మా చిన్నన్న గారిమీద ఆదరభావమూ కూడా పుట్టించాయి వారికి.
మా నాయనగారి నియామకంతో మా చిన్నన్నగారు నామీద పెత్తనం సాగించసాగారు.
అది రకరకాలుగా నడిచేది.
అప్పటికప్పుడే పాదుకాంతదీక్ష యిచ్చివుండినారు మా నాయనగా రాయనకు.
అంచేత, స్నానసంధ్యాద్యనుష్ఠాలైన తరువాత, పొద్దుటిపూట, దినమ్మూ వొకటిరెండు గంటలసేపు మంత్రజపం చేసుకునేవా రాయన.
ఒక్కొక్కనాడు పొద్దున్నే చేసుకునేవారు, వొక్కొక్కనాడు మధ్యాహ్నికభోజనం వేళ చేసుకునేవారు.
జపం చేసుకోడమే పెట్టుకున్నారు; గాని కాలనియమం పెట్టుకోలే దాయన.
106
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1