Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, ప్రజాపరంగా, మూకమొత్తంమీద చెప్పాలంటే తెనుగే అవసరం, సంస్కృతం చాలదు. ఇట్లాగా కొట్టుకుంటున్నాను.

ఇలాగే - 'రాజకీయాలు, నినాదాలు, ఎంత గగ్గోలు ఎత్తించినా అశాంతిని పెంచేవి కాని ఆత్మతృప్తిని అవి కలిగించలేవు' అని నమ్ముతున్నాను.

'ముఖ్యంగా, "నినాదాలు అరుపులు - చాలా - కన్నులలో దుమ్ము కొడుతున్నాయ్" అని నమ్ముతున్నాను.

గ్రామఫోను, రేడియోలు సంగీతాన్నీ, విద్యనూ చవకచేసి మొహం మొత్తించి - చంపుతున్నవి అని భావిస్తున్నాను.

'సినిమా' నటనాశక్తిని పోగులుపెట్టింది అని విశ్వసిస్తున్నాను.

యంత్రం, బస్సు, బియ్యప్పాక్టరీ లేనిచోట బ్రతుకుదాం అని ఆశ పడుతున్నాను.

ఇదంతా 'రిఆక్షనరీ' (వెనక్కు మళ్లేతత్వం) అంటారు, నాకు మిగిలిన బహుకొద్దిమంది స్నేహితులు.

ఇంకా ఇంకా నాలోనే నేను తలపట్లు పట్టుకుంటున్నాను.

ఇట్లాంటి వేళల్లో 'మీ అనుభవాలూ జ్ఞాపకాలూ' నాకు ఎంత గొప్పగా ఉంటాయో మీరే యోచించండి.

ఈ గ్రంధం వ్రాసింది మీరు కాక - మరెవరైనా - నా ఈడుజోడువాడు వ్రాసి ఉంటేనా - ?

బుగ్గనులిపి,

కావలించుకొని, ముద్దెట్టుకొని వుందును.

మరి - వ్రాసింది మీరు - అందుకని -

'అంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రః - ఆపస్తంబసూత్రః -

యజశ్శాఖాధ్యాయీ -

రుక్మిణీనాధశర్మా - అహం భో అభివాదయే'

మీ పాదాలు ముద్దు పెట్టుకొంటున్నా -"

మీ

రాత్రి 10-38.

జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి,

3

"శాస్త్రిగారూ,

మీ 'అనుభవాలూ, జ్ఞాపకాలూను' ఇప్పటికైదారు మాట్లయినా చదివాను. ఇంకా తనివితీరడంలేదు. మళ్ళీమళ్ళీ చదవింపచేసే ఘట్టాలు చాలా ఉన్నాయందులో, చూద్దామంటే మరొకచోట లభించనివి.

పాత వ్యవస్థకు మీతరం చాలా సన్నిహితమైంది. అందులోనూ మీరు ఎదురుతిరిగి లక్ష్యాన్ని సాధించిన దీక్షాపరులు, అంచేత, మీకు తెలిసినంతగా ఆ వ్యవస్థ గుణదోషాలు మరొకరికి తెలియవు. లక్ష్యం. మాత్రమే భేదిల్లడంచేత నిష్పాక్షికంగానూ చూడగలిగారు మీరు. మాతరంవారికానాటి జీవితం కేవలం ఊహాప్రపంచం. ఏ వ్యవస్థా లేకుండా పోతున్న మన జాతికి మంచితరుణంలో వచ్చిన హెచ్చరిక మీపుస్తకం.

అనుభవాలూ - జ్ఞాపకాలూను

Xi