Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూర్యసిద్ధాంతం రీత్యా తీర్చుకోడమూ పంచాంగ రచనలో మా సంప్రదాయం, అప్పట్లో.

అప్పటికి, నాకు, తిథులూ గ్రహస్ఫుటాలూ మాత్రం స్వాధీనం అయినాయి.

గ్రహలాఘవం వల్లించాను, గ్రహణగణితం నేర్చుకుంటున్నాను.

సూర్యసిద్ధాంతం మూలం వర్ణిస్తున్నాను.

అయినా, యెంతో కొంత వీలు చేసుకుని తెనుగు గ్రంథాలు చదువుతూనే వచ్చాను.

రచనా సాగిస్తూనే వచ్చాను.

పంచాంగ రచన మాత్రమే తప్పకపోతే అంతమాత్రాన నాకేమంత యిబ్బంది లేకేపోవును.

కాని, మా నాయనగారవి నిషేధించారు.

వల్లకా దన్నారు, వురిమి.

వల్లూరిలోనూ, వేట్లపాలెంలోనూ వచ్చిన నిషేధం యింటో కూడా సిద్ధపడింది, నాకు.

అయితే, వల్లూరి నిషేధమూ వేట్లపాలెం నిషేధమూ సంస్కృత సాహిత్యాభ్యాసం నిరాఘాటంగా సాగిపోవడానికి మాత్రమే, మొత్తానికి.

మా నాయనగారి నిషేధం మాత్రం అలాంటిది కాదు.

కులక్రమంగా వస్తున్న వైదికవిద్యలకు కొంతయినా అది అంతరాయం కలిగిస్తుందన్న అనుమానం దాని క్కొంత కారణమే, వొప్పుకుంటాను.

కాని, ప్రధానకారణం "తెనుగులో కవిత్వం చెయ్యగూడదు" అని.

అది "అప్రతిష్ఠాకరం" అని.

“పతనమున్ను” అని.

మావాళ్ళ దృష్టిలో, -

తెనుగు వొక సభ్యభాష కాదు.

తెనుగులో సాహిత్యకృషి చెయ్యడం అంటే అకార్యకరణం.

తెనుగులో గ్రంథరచన చెయ్యడం అంటే, మరి, భట్రాజే అయిపోడం.

ఈ విషయమై మా నాయనగారికి గట్టి నమ్మకమే వుండేది.

వారికి మా చిన్నన్నగారు తోడుపడ్డారు.

వారే కాదు, వైదికవిద్యలు నేర్చిన బ్రాహ్మ లెవరయినా యిదే మచ్చు, సాధారణంగా.

ఇంగ్లీషు కూడా వొక భాషే వారి దృష్టిలో, తెలుగు మాత్రం కాదు.

సంస్కృతమే భాష, ముఖ్యంగా.

అది చదివితేనే గౌరవం.

సంస్కృతం అభ్యసించి వుండకపోయినా, కర్మిష్ఠు లైన వైదికులు, అయినవాటికీ కానివాటికీగూడా సంస్కృత శబ్దాలే వాడతారు, తరుచు.

'ఆజ్యం' అంటారు గాని, నెయ్యి అనరు వారు.

పెళ్ళి అంటే నీచకం, వివాహం అనాలి.

104

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1