Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత శ్లోకం అన్వయించే శక్తి వచ్చాక కూడా తెనుగు అన్వయించలేకపోడం పరువుతక్కువగా కనపడింది, నాకు.

జాతి అంతా వ్యవహరించే మాతృభాషలో విశిష్టశక్తి సంపాదించాలనీ, రచన కూడా సాగించా లనీ నా కదివరకే వుండిన ఆశా సంకల్పమూ దీంతో బలపడిపోయాయి.

ఇది గుర్తించి, అప్పటిదాకా తెలుగు గ్రంథాలు ముట్టుకో వద్దంటూ వుండిన మా పెద్దన్నగారు, "సంయే” అన్నారు, ఇష్టపూర్తిగా.

మహోత్కంఠతో నన్నయ భారతం పుచ్చుకున్నా న్నేను, వెంటనే.

నన్నయ భారతం అంటే అంతమాత్రమే కాదు, ఆది పంచకం అంతా వుండిన సంపుటం, అది.

ఎర్రన్న తిక్కన్నల భారతాలూ వున్నాయి అందులో. మా అన్నగారి ఆజ్ఞ చొప్పున శపథం పట్టి, ప్రారంభావస్థలో కూడా, వినోదార్థం అయినా - శారదరాత్రు లన్న పద్యం తరవాత వొక్క బంతిన్నీ చదవలేదు, నేను.

ఆ చదివిం దయినా తదేకదీక్షగా చదవడం పడలేదు నాకు.

కారణాలు, -

జ్యోతిశ్శాస్త్రం స్కంధత్రయమూ సాధించుకోవలసివచ్చింది.

స్మార్తం గట్టిచేసుకోవలసివచ్చింది.

ఔద్గాత్రమున్నూ పూర్తిచేసుకోవలసివచ్చింది.

ఇన్ని వ్యాసంగాల్లో నన్నయ భారతం చదవడానికుండే అవకాశం బహు తక్కువ.

అయినా, దృష్టి మాత్రం దానిమీదే వుండేది.

నిజమే కాని, అంతా కొత్త ప్రపంచం అది.

సంస్కృతం చదవడంతో నా కలవడ్డ శబ్దార్థ జ్ఞానం భారతంలో నాకు అట్టే వుపయోగపడలేదు.

వసుచరిత్రలాగ పాషాణ పాకం కాకపోయినా భారత భాష కూడా భిన్నమే అయింది నాకు.

అందులోని ప్రయోగా లపరిచితాలు కావడంతో కుదరలేదు, మధ్యమధ్య అచ్చ తెనుగు మాటలు.

ఆ సంస్కృత మహా సముద్రంలో అవి జాతిరత్నాలుగానూ, నడకమాత్రం చూసుకుంటే బహు రమ్యంగానూ వుండేవి; కాని పణుగులు.

అయితే, వాటిలో అనేకాలు జాతికి సుపరిచితాలే చదువుకున్నవాళ్ళకి మాత్రమే అపరిచితాలు.

ఆ చదువుకున్నవాళ్ళలోనున్నూ సర్కాలుజిల్లాలవారికి మరీ అపరిచితాలు.

చదువుకున్నవాళ్ళంటే, స్వయంకృషితో, లేక, గురుముఖతః తెనుగువాఙ్మయం చదివినవా ళ్ళని కాదు నా అభిప్రాయం, ఇంగ్లీషో సంస్కృతమో శిక్షాపూర్వకంగా చదివినవాళ్ళు అని.

ఎందుకు చెప్పానంటే?

సనాతనుల దృష్టిలో, సంస్కృతం నేర్చినవాళ్ళే చదువుకున్నవాళ్ళు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

95