అంచేత, ముందు ఆమె దర్శనం చేసుకుని, విశ్వసుందరరావుగారి దర్శనానికి తరవాత వెళ్ళాం మేము, మేడమీదికి.
విశ్వసుందరరావుగారి, జన్మతః దౌహిత్రు లామెకు, వ్యవహారరీత్యా దత్తపుత్రులు.
వారి సౌజన్యమున్నూ ఆ సంస్థానానికి - ఆ కుటుంబానికి - ముఖ్యంగా శ్రీ రంగనాయకమ్మగారి సౌజన్యానికిన్నీ సర్వథా అనుగుణ మైనది.
రాజకళ చూడాలంటే శ్రీ విశ్వసుందరరావుగారినే చూడాలి.
మేము వెళ్ళేటప్పటికి, వారి జనకఅన్న కస్తూరి రామారావు జమీందారుగారు శ్రవణానందం చదివి వినిపిస్తున్నారు, వారికి.
రామారావుగారు బహు చిన్నతనంలోనే స్వర్గస్థులయినారు, కాని ఆ చిన్నతనంలోనే, వారు, బహు సౌమ్యులనీ, మహోదారులనీ, విజ్ఞులున్నూ అనీ మంచిపేరు తెచ్చుకున్నారు.
అప్పట్లో వారికీ మా పెద్దన్నగారికీ బహు మైత్రి.
కుశలప్రశ్నాదికం ముగిశాక, రామారావుగారు మళ్ళీ చదువు సాగించారు, విశ్వసుందరరావుగారికి విశేషాలు వివరిస్తూ.
కొంతసేపటికి "మనమా, వద్దిక నాదు మాట వినుమా మర్యాద గాపాడుమా" అన్న పద్యాలు ప్రారంభం అయినాయి.
మంచి మకుటంతో వుండడంవల్ల యెలాంటివారినీ ఆకర్షించే పద్యాలవి.
విజ్ఞులకు “నాదు మాట" అన్నచోట ఝడితిస్ఫురణగా రచనలో కొంత అప్రౌఢిమ తోస్తుంది, దానికేం, శ్రవణానందంలో అదొక రమ్యమైన ఘట్టం, మొత్తానికి.
అదే నే నది వినడం.
వినగా వినగా నడక బాగానే వుంది; గాని పద్యాలలో బింకం తక్కువ అన్నట్టనిపించింది, నాకు.
"పులుముడు "న్నూ యెక్కువగా కనపడింది.
మా పెద్దఅన్నగారు నాకేసి చూశారు, సాకూతంగా.
అది చూడగా నాకు చిరునవ్వు వచ్చింది గాని; మొగం పక్కకి తిప్పేసుకున్నాను.
లాభం లేకపోయింది, రామారావుగారు మా ధోరణి కనిపెట్టేశారు, అప్పటికే.
"ఏం, యెందుకూ నవ్వుకుంటున్నారూ?" అనడుగుతూ పుస్తకం కూడా కింద పెట్టేశారు వారు, చర్చకు సిద్ధపడి.
కొంతసేపు నేనూ, మరికొంతసేపు మా అన్నగారూ మాట మరిపించాలని చూశాం, ప్రయోజనం లేకపోయింది.
తప్పనిసరి అయి, చివరికి "నీ అభిప్రాయం చెప్పేసెయ్యి" అన్నారు మా అన్నగారు, నేను చెప్పేశాను.
దానిమీద తర్జనభర్జన జరిగింది.
రామారావుగారు కవుల పక్షం వహించారు.
మా అన్నగారి ఆసరా చూసుకుని నే నెదిరించాను.
ఒక్క పావుగంట చూసి, అప్పు డందుకుని, వివరంగా, గుణదోషనిరూపణ చేసి రామారావుగారిని వొప్పించారు, మా అన్నగారు.
92
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1