Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్గిరికి రానిచ్చాను.

సా-చి కొట్టాను నేలమీదే, కర్రతిరగవేసి.

ఖంగు మనడానికి బదులు, ఢామ్మంది నేల, రామడోల్లాగ.

"బాబోయ్” అంటూ యెగిసిపడి, యేడుపు లంకించుకున్నాడు, సుబ్రహ్మణ్యశాస్త్రి.

మహా బాగా జరిగిం దనుకున్నాను.

కాని యింతలో మరో మనిషి యేడుపున్నూ వినవచ్చింది.

పరకాయించగా, సర్వేశ్వరచయనులున్నూ యేడుస్తున్నాడు.

అతనూ వస్తున్నాడు కాబోలు, వెనకాల వుండడంవల్ల నేను గమనించలేదు.

సంగతి తెలియగానే జరిగిందంతా చెప్పాను గాని; భయభ్రాంతివల్ల చయనులది వినిపించుకోలేదు.

ఆ రాత్రి గురువుగారి యింటో చాలా రభస అయింది.

సర్వేశ్వరచయను లప్పుడలా బెదిరిపోయి యేడ్చివుండిన్నీ కూడా, నేను చేసిందేమిటో వున్నదున్నట్టు చెప్పాడు.

"ఇంతమాత్రానికే యేడవాలా? అంటూ సుబ్రహ్మణ్యశాస్త్రినే యెగతాళి చేశాడు, రామసోమయాజులు.

గురువుగారి తల్లి కూడా, అతనావేళ చేసింది చూసి వుంది కనక, నన్నేమీ అనలేక “తొందరపడ్డావురా నాయనా" అని మాత్రం అంది, తన కొడుకున్నూ భయపడ్డాడు కనక, కొద్దిపాటి అసంతృప్తితో.

ఆవిడ చెప్పింది విని, మొదట మహోగ్రు లయిపోయిన గురువుగారున్నూ తరవాత శాంతించి "వూరుకోండి, వూరుకోండి" అంటూ వీధి అరుగుమీదికి వెళ్ళిపోయి, మహిమ్నం అందుకున్నారు.

గురువుగారి తండ్రి చలమయ్యశాస్త్రిగారు మాత్రం మండిపడిపోయారు, నామీద.

"నా కొడుకుని జడిపిస్తావా?" అంటూ మండిపడితే, పడివూరుకుందున్నేను. “నా మేనల్లుణ్ణి భయ పెడతావా?” అంటూ ప్రారంభించా రాయన.

భార్య యెంతయినా చెప్పింది; కాని శాంతించలేకపోయా రాయన.

తప్పు గుర్తించకపోవడం - బంధుత్వంలో దగ్గిరా, దూరమూ అంటూ ఆరాలు తియ్యడం - నేనిది సహించలేకపోయాను.

మర్నాటి రాత్రే నేనింటికి బయలుదేరాను, మూటాముల్లే కట్టుకుని.

ఆ రాత్రి పడవ దాటిపోయింది, అంచేత మర్నాటిదాకా ఆగవలసివచ్చింది.

పోనీ అంటే, పడవ వుండిన చోట రెయి లెక్కడం అప్పటికింకా అలవాటు కాలేదు.

పైగా, పొరుగింటనే కాదూ, భోజనం?

మర్నాడు నేను గుడిలోనే వుండిపోయాను చాలాసేపు, పాఠం సమయాన తప్ప.

చయనులూ రామసోమయాజులూ తెల్లపోయారు నా ప్రయాణం చూసి.

"స్వల్పవిషయం, పైగా, ఆయన పెద్దలూ అనతగ్గవారూను; కనక, మనస్సు సరిపెట్టుకో” అన్నారు, గురువుగారు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

83