Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతను నాకంటే కొంచెం చిన్న.

తరవాత యెప్పుడో అయిం దతనికి పెళ్ళి. మా అత్తవారి వూరే అతని అత్తవారి వూరున్ను.

అప్పటి కతను కుమారసంభవం చదువుతున్నాడు.

అయితే, అతను వారాలు చేసుకునేవాడు కాడు.

గురువుగారి తల్లి స్వయానా తనకి మేనత్త కావడంవల్ల వారింటోనే భోజనం చేసేవాడు.

అతనికీ నాకూ మనస్సులు కలియలేదు.

నేను వారాలు చేసుకోడం, తానే గురువుగారికి చుట్టంకాని, నేనెక్కణ్ణుంచో వచ్చిన వాణ్ణన్న భావం కలిగించిం దతనికి.

గురువుగారి తమ్ముడు సర్వేశ్వరచయనులూ (ఇప్పుడు సర్వేశ్వరశాస్త్రి - మహావైయాకరణి) గురువుగారి చెల్లెలి భర్త పీసపాటి రామసోమయాజులూ నేనంటే ప్రాణం యిచ్చేవారు.

అది అతని కిష్టంలేదు.

"నేను మీకు దగ్గిరవాణ్ణి. అతను బహదూరం. కనక, నా పక్షంగా వుండాలి మీరు" అనేవా డతను; కాని వాళ్ళందు కంగీకరించలేదు.

"అందరమూ బంధువులమే" అని వాళ్ళ వాదం.

వాళ్ళని తా నాకర్షించుకోలేకపోడం - నేను మాయచేసి లోపుచేసుకున్నా ననుకోడం - దీంతో, నా యెడల యీర్ష్య వహించా డతను.

నేనూ తక్కువ చెయ్యలే దతనితో - డీకున్నాను.

ఘర్షణ పడలేదు, అంతే, అక్కస్సు మాత్రం పెంచుకున్నాం మేము.

మాటలు మానుకోలేదు, పులుకూ పలుకూ మాత్రం చూసుకునేవాళ్ళం.

కుటుంబాల పరంగా మాకుండుకున్న పూర్వవైమనస్యాలు దీనికి పూర్వరంగం.

దీంతో, బాహాటంగా మేము వేరయిపోయాం.

ఒక వరలో రెండు కత్తులున్నట్టు తయారయింది, మా స్థితి.

ఇటు, ఇది యిలా వుండగా, అటు, నిరాఘాటంగా సాగిపోతోంది, నా కథారచన.

గురువుగారి యింటికి చేరి, దినానికి రెండుమాట్లు అర్చకుడు మాత్రమే స్వామిదర్శనం చేసుకునే శివాలయం వుంది, చిన్నది.

దాని ఆవరణకి వీధివైపున వొక కొంజా.

ఆ కొంజాకి లోపలిభాగాన రెండు గదులు.

వాటిలో వొకటి తన స్వాధీనంలో వుంచుకుని రెండోది నా కప్పగించాడు, అర్చకుడు.

రామసోమయాజుల్ని అక్కడికి తీసుకువెళ్ళి నా కథ అతనికి వినిపించి మురిసిపోయేవాణ్ణి నేను.

వయసు మళ్ళినవాడే కాని నా కథ లంటే చెవికోసుకునేవాడు, అర్చకుడున్నూ.

ఒకనాడు, నేనూ రామసోమయాజులూ, అర్చకుడూ వొక కథలో లీనం అయివుండగా చూశాడు, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెళ్ళి గురువుగారితోనూ చెప్పాడు,

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

81