Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడ దొరికిన ఆ కథల పుస్తకా లన్నిటిలోనూ భాష అసహ్యంగా వుండేది, అయినా, ఆ ధోరణికోసమూ ఆ యుక్తుల కోసమూ నేనవి విడిచిపెట్టలేకపోయేవాణ్ణి.

కాగా, - అక్కడికి వెళ్ళగానే భారవి వొకచోట పడెయ్యడమూ, ఆ పుస్తకాలందుకోడమూనూ నేను.

నిజంగా, శ్రీవైష్ణవులు రామాయణం పారాయణ చేసేటట్టు చదివాను, నే నవి.

ఆ చదువు నన్ను కథారచనలోకి దింపేసింది.

దాంతో, వల్లూరిలో కథలు కల్పించినవాణ్ణల్లా, వేట్లపాలెంలో కథలు రచించడమే ప్రారంభించాను.

అవన్నీ శివలీలలకు సంబంధించి వుండేవి.

శివమహిమలతోనున్నూ నిండివుండేవి.

స్టేషనుమాస్టరు, అవి రాసుకోడానికి రెయిల్వేఫారా లిచ్చేవాడు, కావలసినన్నీ.

అయితే, ఆయన యీ వారం యిచ్చిన కాగితాలన్నీ మళ్ళీ వారం నాటికి నేను నలుపు చెయ్యాలి, తప్పనిసరిగా.

ఆ రాత చూపిస్తేనే మళ్ళీ కాగితాలిచ్చేవా రాయన.

ఇదికూడా నా కథారచనకు దోహదం ఆయింది, అనుకోనిది.

మొత్తానికి, నేను వేట్లపాలెం వెళ్ళడం కావ్యాలు చదువుకోడానికీ, అక్కడ వుండడం కథలు రాయడానికీ అన్నట్టయింది.

లేకపోతే కాలం గడపడం యెలాగా?

గురువుగారి దగ్గిర రోజూ నాలుగేసి శ్లోకాలు చెప్పుకోడం - ఆ వరసనే ఒక్క గంటసేపు అవి బాగా వల్లించడం - మన్నాడు పొద్దున చింతన చేశాటప్పుడవి తరిచితరిచి మనస్సుకి పట్టించుకోడం - రాత్రి పడుకుని ఆ సర్గలో అయిన శ్లోకాలన్నీ దండకం లాగ మూలం మాత్రం మెల్లిగా యేకరువు పెట్టుకోడం - అంతే, మరి, పుస్తకం చేతబట్టడం లేదు.

మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినచోట కొత్త శ్లోకాలు చూసుకోడం అయిపోయేది.

దీంతో, చాలామందికి నా చదువు కనపడేది కాదు, పరీక్షిస్తే తప్ప.

దీనికితోడు పక్షానికి మూడురోజు లనధ్యాయాలు.

పౌర్ణమినాడూ, అమావాస్యనాడూ పుస్తకమే ముట్టగూడదు, మరి.

సాధారణంగా, ఆటల్లో దిగితే కుర్రవాళ్ళ కెంతకాలమూ చాలదు.

నాకు కావ్యపాఠానికి కొన్ని గంటలు సరిపోయేవి, కథారచనకు మాత్రం వారాలకు వారాలే చాలేవి కావు.

ఇదిగో, యిది నిమిత్తమాత్రం అయిపోయింది, నే నక్కణ్ణుంచి వెళ్ళిపోడానికి.

27

నేను వెళ్ళిన కొన్నాళ్ళకి గురువుగారి చిన్నమేనమామ పిడపర్తి చిన పూర్ణయ్య సిద్ధాంతిగారి రెండో కొడుకు సుబ్రహ్మణ్య శాస్త్రిన్నీ వచ్చాడక్కడికి చదువుకోడానికి.

80

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - 1